అర్నాబ్ కు హైకోర్టు లో చుక్కెదురు…..  గవర్నర్ ఆందోళన 

2018లో ఇంటీరియర్ డిజైనర్‌ని, అతడి తల్లిని ఆత్మహత్యకి ప్రేరేపించారన్న ఆరోపణపై అరెస్టైన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నాబ్ గోస్వామికి బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు మరోసారి నిరాకరించింది. 

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేని స్పష్టం చేసింది. అలాగే హైకోర్టును ఆశ్రయించేముందుగా అలీబాగ్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే ఇప్పటికే అలీబాగ్‌ సెషన్స్‌ కోర్టులో అర్నాబ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో సంబంధిత పిటిషనపై నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇంతకు ముందు ఒకసారి అర్నాబ్ వేసుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు ఈ కేసులో ఆయనను నవంబరు 18 వరకు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.

2018 నాటి ఆత్మహత్య కేసులో తమకు కొత్త ఆధారాలు దొరికాయని పోలీసులు పేర్కొనడంతో అర్నాబ్ గోస్వామిని గత వారం (నవంబర్ 4న) ముంబైలోని తన ఇంట్లో ఉండగానే పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని మొదట ఖైదీల నిర్భంద కేంద్రంగా మార్చిన స్థానిక పాఠశాలలో ఉంచారు. 

అనంతరం, అతన్ని తలోజా జైలుకు తరలించారు. అరెస్ట్ అయిన మరుసటి రోజునే అర్నాబ్ తక్షణ బెయిల్‌కు పిటిషన్ వేశారు. అయితే దాన్ని బాంబే హైకోర్టు తిరస్కిరించింది.

మరోవంక, అర్నబ్ గోస్వామి పరిస్థితిపై గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉదయం గవర్నర్ కోషియారీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఫోన్ చేశారు. అర్నబ్ ఆరోగ్య పరిస్థితి, భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

అర్న‌బ్‌కు భ‌ద్ర‌త పెంచాల‌ని గ‌వ‌ర్న‌ర్ సూచించారు. అలాగే కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకునేందుకు అర్న‌బ్‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని హోంమంత్రిని గ‌వ‌ర్న‌ర్ కోరారు.

జైల్లో అధికారులు తనను వేధిస్తున్నారని, కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవడానికి అనుమతించడం లేదని తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోషియారి హోంమంత్రి దేశ్‌ముఖ్‌కు ఫోన్ చేశారు.