సుప్రీం కోర్ట్ ఆశ్రయించిన అర్నాబ్‌ భార్య సమ్యాబ్రతా

సుప్రీం కోర్ట్ ఆశ్రయించిన అర్నాబ్‌ భార్య సమ్యాబ్రతా

‘రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి  ప్రాణానికి ముప్పు ఉంది. కస్టడీ సమయంలో పోలీసులు విచక్షణ మరిచి ప్రవర్తించారు. అర్నబ్‌ అరెస్టయి ఇప్పటికే 4 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీలో గడిపారు. జైలులో ఉన్న సమయంలో జైలర్‌ తనపై దాడి చేశారని, తన ప్రాణానికి ముప్పు ఉందని అర్నబ్‌ పదేపదే చెప్తున్నాడు. ఈ విషయంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని’ అర్నాబ్‌ భార్య సమ్యాబ్రతా రే సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు.

‘దశాబ్ధాలుగా మీడియా రంగంలో ఖ్యాతి గడించిన వ్యక్తిపై అసంబద్దమైన ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు దాడికి దిగడం, వేధించడం చేశారు. రాజకీయంగా ప్రేరేపించబడిన ఓ చర్యకు రాష్ట్ర యంత్రాంగం వత్తాసు పలుకుతోంది’ అంటూ ఆమె ఆరోపించారు.

ప్రజాస్వామ్యం మూలస్తంభాలను సమాధి చేయాలని చూస్తున్నారని అంటూ మానవ హక్కుల ఉల్లంఘనలకు రాష్ట్ర యంత్రాంగం మద్దతుగా ఉండటం సరికాదని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలను కాపాడటానికి ఉద్దేశించిన సంస్థలే హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని, ప్రాథమిక హక్కులను హరిస్తున్నాయని ఆమె ఆరోపించారు.

‘సంస్థాగతంగా ప్రజాస్వామ్యం మునుపెన్నడు లేని విధంగా ప్రమాదంలో ఉంది. నా భర్త అక్రమంగా అరెస్ట్‌ చేసి శారీరకంగా హింసించారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లినప్పటికీ, ఎటువంటి జోక్యం చేసుకోలేదు. అర్నాబ్‌ తన ప్రాణానికి ముప్పు ఉందని, పోలీసుల అదుపులో తాను ఎదుర్కొంటున్న దారుణాలను బహిరంగంగా వెల్లడించారు’ అంటూ ఆమె సుప్రీం కోర్ట్ కు నివేదించారు.

తన భర్తకు ఏదైనా హాని జరిగితే పోలీస్‌ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర యం‍త్రాంగాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. జవాబుదారీతనాన్ని కోరిన ఓ జర్నలిస్టును శిక్షించడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలపై సుప్రీం కోర్టు దృష్టి సారించాలని ఆమె వినయంగా విజ్ఞప్తి చేశారు.