మైనారిటీల హక్కులను కాపాడటంలో పాక్ విఫలం   

పాకిస్థాన్ మైనారిటీల హక్కులను కాపాడటంలో విఫలమవుతోందని జెనీవాకు చెందిన ప్రభుత్వేతర సంస్థ యూఎన్ వాచ్ మండిపడింది.  ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలిలో పాకిస్థాన్ కొనసాగడం సహించరానిదని స్పష్టం చేసింది. 

పాక్‌లోని మైనారిటీలు హిందువులు, క్రైస్తవులు వివక్షకు గురవుతున్నారని, బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పారిస్‌లో ఓ ఇస్లామిక్ ఉగ్రవాది ఓ ఫ్రెంచ్ టీచర్‌ను హత్య చేయడాన్ని పాకిస్థాన్ సమర్థించడం పట్ల యూఎన్ వాచ్ పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్‌ను ప్రచురించడాన్ని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్ సమర్థించారు. రాడికల్ ఇస్లాంపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో ఆయనపై ముస్లిం మెజారిటీ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఉద్దేశపూర్వకంగానే ముస్లింలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘‘వాక్ స్వాతంత్య్రం ముసుగులో దైవ దూషణ సహించరానిది’’ అని పేర్కొన్నారు. 

దీనిపై యూఎన్ వాచ్ స్పందిస్తూ, ‘‘యూఎన్ మానవ హక్కుల మండలిలో మీరు (పాకిస్తాన్) ఉండటం సహించరానిది’’ అని పేర్కొంది. ఐరాస మానవ హక్కుల మండలికి పాకిస్థాన్ ఎన్నిక కాకూడదని సెప్టెంబరు 28నతాము ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను జత చేసింది. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ పాకిస్థాన్ అక్టోబరులో ఐరాస మానవ హక్కుల మండలికి ఎన్నికైంది. 

పాకిస్థాన్‌లో మతపరమైన మైనారిటీలు వివక్షకు గురవుతున్నారని, వర్గ హింసకు బలి అవుతున్నారని, బలవంతపు మతమార్పిడులకు గురవుతున్నారని యూఎన్ వాచ్  ధ్వజమెత్తింది. 

ఐదుగురు పిల్లలుగల క్రైస్తవురాలు ఆసియా బీబీ మరణ శిక్షకు గురయ్యారని, ఒక కప్పు నీటి కోసం స్థానిక ముస్లిం మహిళలతో ఘర్షణ జరగడంతో దైవ దూషణ ఆరోపణలు ఆమెపై నమోదయ్యాయని పేర్కొంది. ఆమెకు మద్దతిచ్చిన ఇద్దరు రాజకీయ నేతలు హత్యకు గురయ్యారని తెలిపింది. 

రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో పాకిస్థాన్ అట్టడుగున ఉందని గుర్తు చేసింది.