ఓటమి అంగీకరించని డోనాల్డ్ ట్రంప్   

తాను ఓటమిని అంగీకరించడం లేదని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రజానీకం ఓటు పట్ల ద్రోహం జరిగిందని, ఓట్ల లెక్కింపులో పూర్తి విశ్వసనీయత అవసరం అని, ఇది అమెరికన్ల హక్కు అని, సక్రమ కౌంటింగ్ జరిగే వరకూ తాను నిద్రపొయ్యేది లేదని ట్రంప్ ప్రకటించారు.   
 
అమెరికా అధ్యక్షులుగా జో బైడెన్ విజయం సాధించినట్లు అమెరికా మీడియా ప్రకటించిన నేపథ్యంలోనే ట్రంప్ తన సొంత గోల్ఫ్ కోర్టులో సేదదీరుతూ నిజాయితీతో పడ్డ ప్రతి ఓటు విలువ తేలాల్సిందే తేల్చి చెప్పారు. 
 
కీలకమైన స్వింగ్ రాష్ట్రాలలో కౌంటింగ్ నిలిపివేయాలని తాను కోరుతూ వచ్చినా అక్కడ కౌంటింగ్ జరగడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఈ ఎన్నికల ఫలితం హరించడం జరిగిందని ఆరోపించారు. 
 
అయితే దీనికి ఆధారాలను ఆయన వెల్లడించలేదు. ఈ ఎన్నికలలో అసాధారణ స్థాయిలో ఓట్ల లెక్కింపు ప్రస్తావన వచ్చింది. చట్టబద్ధంగా పోలయిన ఓట్లే అసలు సిసలైన ప్రెసిడెంట్ ఎవరనేది ఖరారు చేస్తాయని చెప్పారు. 
 
ఈ ఓట్లు తనకు అనుకూలంగా ఉండగా అక్రమ రీతిలో జరిగిన కౌంటింగ్ ప్రక్రియను ప్రాతిపదికగా చేసుకుని దేశాధ్యక్షుడిని మీడియా సృష్టించడం కుదరదని పత్రికలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. తానైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించేది లేదని భీష్మించారు.
ప్రధాన మీడియా సంస్థలు బైడెన్‌ను ప్రెసిడెంట్ అని పేర్కొంటున్న దశలో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  సోమవారం నుంచి చూడండి మా స్థాయిలో పెద్ద ఎత్తున కోర్టులలో ప్రస్తుత పరిస్థితిపై కేసు ఆరంభం అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో ఎన్నికల చట్టాలు సరైన విధంగా అమలు అయ్యేలా చూడాల్సి  ఉందని పేర్కొన్నారు.