21 రోజుల్లో ప్రపంచంలో కోటి కరోనా కేసులు

ప్రపంచంలో కరోనా తగ్గిన్నట్లు తగ్గి తిరిగి విజృభింస్తున్నది. గత 21 రోజులలోనే కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. మొదట్లో కోటి కేసులు చేరుకోవడానికి ఆరు నెలలు పడితే ఇప్పుడు మూడు వారాలలోనే చేరుకున్నాయి. 
 
మొత్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 5 కోట్లకు దాటింది. అమెరికా, ఐరోపాలలో తిరిగి పరిస్థితి దిగజారుతున్నది. అమెరికాలో రోజుకు లక్ష మంది వైరస్ బారిన పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా కేసులు ఐరోపాలోని ఉన్నాయి. ప్రపంచంలో రెండు రోజులుగా కరోనా కేసులు 6 లక్షలకు పైగా నమోదవుతున్నాయి.
 
రెండు రోజులుగా 9 వేల మందికిపైగా మహమ్మారికి బలవుతున్నారు. ఐరోపా​లో మొత్తంగా ఇప్పటిదాకా కోటీ 19 లక్షల మందికి కరోనా సోకింది. ప్రపంచమంతా ఒక్కరోజులో 6 లక్షల కేసులొస్తే అందులో సగానికిపైగా ఒక్క ఐరోపా​లోనే వచ్చాయి.
 అత్యధికంగా ఫ్రాన్స్​లో ఒక్కరోజులోనే 86,852 కొత్త కేసులొచ్చాయి. మొత్తంగా 17.49 లక్షల మందికి మహమ్మారి సోకితే, 40,169 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్నది ఇటలీ ఉంది. మొత్తంగా అక్కడ 9.2  లక్షల మంది కరోనా బారిన పడితే.. 41,063 మంది చనిపోయారు.
కేసులలో రష్యా ఐరోపాలో అగ్రస్థానాల్లో ఉన్నా ఇప్పుడు ఫ్రాన్స్ ఆ దేశాన్ని అధిగమిస్తున్నది.రష్యాలో 17.54  లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు.  మరణాల్లో బ్రిటన్​ మొదటి స్థానంలోఉంది. 48,888 మంది కరోనాకు బలయ్యారు.
ముందు నుంచీ నిర్లక్ష్యంగానే ఉన్న స్పెయిన్​లోనూ కేసులు బాగా పెరుగుతున్నాయి. దానికి కారణం నైట్​లైఫ్​కు అనుమతివ్వడమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం కేసులు 13.88 లక్షలు కాగా, 38,833 మంది చనిపోయారు. మొదట్లో అసలు ప్రభావం చూపని పోలండ్​లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 5.22  లక్షల కేసులతో ఐరోపాలో ఏడో స్థానానికి వచ్చింది ఆ దేశం.

కేసులు పెరుగుతుండడంతో గురువారం ఇటలీ ప్రభుత్వం లాక్​డౌన్​ ప్రకటించింది. మూడు జోన్లుగా విభజించి ఆంక్షలు పెట్టింది. దేశం మొత్తం రాత్రంతా కర్ఫ్యూ, పొద్దంతా లాక్​డౌన్​లు విధించింది. 

ఆఫీసులు, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని ఆదేశాలిచ్చింది. లాక్​డౌన్​ను నిరసిస్తూ స్లొవేనియాలో జనం ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వాటర్​ కెనాన్​లను ఆందోళన కారులపైకి ప్రయోగించారు. 

ఫ్రాన్స్​లో కేసులు పెరుగుతున్నా స్కూళ్లను ఇంకా ఓపెన్​ చేసి ఉంచడంపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. స్కూల్స్​ ఓపెన్​చేసినా కనీస జాగ్రత్తలు తీసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. 

బుక్​ షాపులను క్లోజ్​ చేయడాన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. బుక్​షాపులు తెరవాల్సిందిగా దాదాపు 2 లక్షల మంది దాకా ఫ్రెంచ్​ ప్రెసిడెంట్​కు పిటిషన్​ పంపించారు. జర్మనీలోనూ బుక్​షాపులు తెరవాలంటూ జనం ఆందోళనలు చేస్తున్నారు.

శ్రీలంకలో థర్డ్​వేవ్​ వచ్చే ముప్పు పొంచి ఉందని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతూనే.. ఆంక్షలను ఎత్తేస్తోంది. దేశ రాజధాని నగరం కొలంబోలో లాక్​డౌన్​ను తీసేసింది. రాత్రి కర్ఫ్యూను ఎత్తేసింది.