తండ్రీ కొడుకుల ప్రభుత్వాన్ని తరిమికొడతాం 

రాబోయే రోజుల్లో తెలంగాణలో తండ్రీ కొడుకుల ప్రభుత్వాన్ని తరిమికొడతామని  కేంద్ర సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణపై ప్రధాని మోదీ  వివక్ష చూపిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ  వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికలు పంపలేదని తెలిపారు. 

హైదరాబాద్ లోని తాడ్‌ బండ్ సిక్‌ విలేజ్ హాకీ గ్రౌండ్స్‌లో ఆదివారం బీజేపీ ఏర్పాటు చేసిన సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో కలసి పాల్గొంటూ వరదలను నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. అయినా విపత్తు తక్షణ సాయంగా తెలంగాణకు కేంద్రం రూ.224 కోట్లను పంపిందని తెలిపారు. 

ఎన్నికలపై ఉన్న ద్యాస ప్రభుత్వానికి ప్రజల బాగుపై లేదని దుయ్యబట్టారు. వరద నష్టంపై సమగ్ర నివేదికలు పంపాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. బీజేపీని బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం నివేదికలు పంపలేదని విమర్శించారు. 

సీఎంల నిర్లక్ష్యం కారణంగానే వందల కాలనీలు నీట మునిగాయని విమర్శించారు.  ప్రజలకు అబద్దాలు, అవాస్తవాలు చెప్పటం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు.  వరద బాధితులను సీఎం పరామర్శించకపోవటం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. పేదలకు ఇవ్వాల్సిన రూ. 10,000లను కూడా కేటీఆర్ అనుచరులు తన్నుకుపోతున్నారని ధ్వజమెత్తారు. 

తెలంగాణ రోడ్ల కోసం కేంద్రం రూ. 202 కోట్లు ఇచ్చిందని చెబుతూ హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించిన రూ.67 కోట్లు ఎటు పోయాయో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.  డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని పేర్కొంటూఅసలు ఎన్ని ఇళ్లు ఇచ్చారో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించాలని నిలదీశారు. 

హైదరాబాద్ ‌కు సముద్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్ ‌దే అంటూ ఎద్దేవా చేశారు. హైద్రాబాద్ ‌లో గుంతలు లేని రోడ్లు కేటీఆర్ చూపించగలడా? అంటూ సవాల్ చేశారు. ఆ విధంగా చూపించిన వారికి లక్ష్య రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి పీఠం కోసం కేటీఆర్, సంతోష్‌రావుల మధ్య పంచాయితీ నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కంటోన్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, కంటోన్మెంట్‌కు వచ్చే నిధులన్నీ కేంద్రానివేనని ఆయన స్పష్టం చేశారు. 
 
కేంద్రం నిధులపై తాను విసిరిన సవాల్‌కు సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధమని మరోసారి వెల్లడించారు. రాష్ట్ర మంత్రులకు అహంకారం నెత్తికెక్కిందని దయ్యపట్టారు. కేసీఆర్ కేబినెట్‌లో తాగుబోతులు, తిగురుబోతులున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 
 
దుబ్బాక ఉప ఎన్నికపై టీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం‌ ప్రదర్శిస్తోందని సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ ఎక్కడుందో కవిత, బోయినపల్లి వినోద్‌ను అడిగితే తెలుస్తుందని తెలిపారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని భరోసా వ్యక్తం చేశారు.