గత ఏడాది నిజామాబాదు నుండి లోక్ సభ ఎన్నికలలో తిరిగి పోటీ చేసి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఘోర పరాజయం పొందినప్పటి నుండి రాజకీయంగా `విరామం’ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమార్తె కవిత ఇప్పుడు తాజాగా శాసన మండలికి ఎన్నిక కావడంతో ఆమె రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం ఖాయం అనే కధనాలు వెలువడుతున్నాయి.
ఇప్పటికే కొడుకు, మేనల్లుడులను మంత్రివర్గంలో చేర్చుకున్న కేసీఆర్ కుమార్తెకు కూడా అవకాశం ఇవ్వడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటాలు జరిపి, అనేక త్యాగాలు చేసిన ప్రజానీకం కేసీఆర్ చెప్పిన్నట్లు `బంగారు తెలంగాణ’ సాధన కోసం కాదని, ఆయన కుటంబం కోసమే అనే నానుడిని నిజం చేయనున్నారా అనే అనుమానాలు అధికార పక్షంలోనే కలుగుతున్నాయి.
ఇప్పటికే సీనియర్ అధికారులు కేవలం కేటీఆర్ `ఆదేశాలు’ కోసమే ఎదురు చూస్తున్నారని, మంత్రులు ఎవ్వరిని లెక్క చేయడం లేదని చెప్పుకొంటున్నారు. ముఖ్యమంత్రి అయితే అసలు సచివాలయంకే రారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకే కాకుండా మంత్రులకు కూడా అందుబాటులో ఉండరు.
వందేళ్లలో ఎరుగని భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో అల్లకల్లోలం సృష్టించినా కేసీఆర్ ఇల్లు దాటి బైటకు రాలేదు. అంతా కేటీఆర్ చూసుకొంటారులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కవితను కూడా మంత్రివర్గంలోకి తీసుకు రావడం ద్వారా కొడుకు, కుమార్తె కలిపి పాలన మొత్తాన్ని చూసుకొనే విధంగా చేస్తారని భావిస్తున్నారు.
ఇప్పటికే 18 మంది మంత్రులు ఉన్నారు. కవితను మంత్రివర్గంలో చేర్చుకోవాలి అంటే ఎవ్వరో ఒకరిని మంత్రివర్గం నుండి తొలగించ వలసిందే. ఇప్పటికే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పలుచోట్ల వీధిన పడుతున్నాయి. కవిత ఓటమికి ప్రధాన కారణం పార్టీలో అంతర్గత కుమ్ములాటలని, ఆమె ఆధిపత్య ధోరణులే అనే భావిస్తున్నారు.
ఆమెను మంత్రివర్గంలో చేర్చుకొంటే ఈ ప్రభావం మొత్తం పాలనా యంత్రాంగంపై, పార్టీ వ్యవహారాలపై పడే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి. తెలంగాణ తొలి హోమ్ మంత్రి నాయని నరసింహారెడ్డి చనిపోతే కేటీఆర్ ఆయన పాడే మోశారు.
కానీ నాయనకు స్వయంగా గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన అల్లుడికి అసెంబ్లీ సీట్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ అప్పటి నుండి కనీసం కలవడానికి కూడా సమయం ఇవ్వకుండా దూరంగా ఉంచారు.
హైదరాబాద్ నగరంలో అంతా కేటీఆర్ హవా నడవడం కోసం, సీనియర్ రాజకీయ వేత్త నాయని వంటి వారు అధికార పదవులలో ఉంటె ఇబ్బంది అవుతుందని మంత్రివర్గంలో స్థానం ఇవ్వక పోవడమే కాకుండా, ఆయన ఎమ్యెల్సీ పదవీకాలం పూర్తయినా తిరిగి మండలికి నామినేట్ చేయక పోవడం గమనార్హం.
ఇప్పటికే కేసీఆర్ పాలన పట్ల వివిధ వర్గాల ప్రజలతోనే కాకుండా, సొంత పార్టీలో సహితం అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. పాలనను గాడిన పెట్టె ప్రయత్నం చేయకుండా కొడుకుతో పాటు కుమార్తెకు కూడా పాలన అప్పచెప్పితే పరిణామాలు తీ వ్రంగా ఉండే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది ఎన్నికలలో చంద్రబాబునాయుడు ఘోర పరాజయం పొందడానికి ప్రధాన కారణాలలో ఒకటి రాజకీయ పరిపక్వత లేని కుమారుడు లోకేష్ ను మంత్రివర్గంలో చేర్చుకోవడమే అని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ఒక విధంగా ఈ విషయమై ముందుగానే చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయాలలో రాటుతేలేకుండా మంత్రిపదవి ఇస్తే సులభంగా అల్లరి అవుతాడని, అతని రాజకీయ భవిష్యత్ కె కాకుండా, పార్టీకి, ప్రభుత్వానికి కూడా చేటు తెస్తాడని మంత్రి పదవి ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేశారు.
అనుభవం లేకుండా మంత్రిపదవి వద్దని నందమూరి బాలకృష్ణ కూడా వారించాడు. అయితే భార్య, కోడలు వత్తిడులకు తట్టుకోలేక చంద్రబాబు మంత్రిపదవి ఇవ్వవలసి వచ్చింది.
మంత్రిపదవి ఇచ్చిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో లోకేష్ కు ఎదురు చెప్పేవారు లేకుండా చేసుకోవడం కోసం సీనియర్లు అందరిని పక్కన పెట్టారు. వైసిపి నుండి వచ్చిన ఫిరాయింపు దారులకు, రాజకీయ నేపథ్యంలేని సంపన్నులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇవ్వన్నీ కలసి ఎన్నికలలో పార్టీని ఓటమివైపు నడిపించాయి.
తెలంగాణలో సహితం సొంతంగా పార్టీకి మెజారిటీ ఉన్నా ఇతర పార్టీలవారిని చేర్చుకొని కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నది కేటీఆర్ ను పార్టీలో ప్రశ్నించేవారు లేకుండా చేసుకోవడం కోసమే. అందుకనే తొలినుండి పార్టీలో, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారిని పక్కన పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.
ఈటెల రాజేందర్ వంటి వారికి మంత్రిపదవులు ఇచ్చినా ఉత్సవ విగ్రహాలుగా మారవలసి వస్తున్నది. చివరకు మేనల్లుడు హరీష్ రావు సహితం పేరుకు ఆర్ధిక మంత్రి అయినా ఆచరణలో ఆర్ధిక వ్యవహారాలు అంటినిని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ చూస్తున్నారు.
నిజంగా కవితకు అధికార పదవి ఇవ్వడమే లక్ష్యమయితే రాజ్యసభకు పంపి ఉండేవారు. కానీ ఎమ్యెల్సీగా చేయడం ద్వారా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వంలో కేటీఆర్ తో పాటు కీలక ప్రాధాన్యత ఇవ్వడమే అని స్పష్టం అవుతుంది. అదే జరిగితే పార్టీలో, ప్రభుత్వంలో కేసీఆర్ పట్టుకోల్పోవడమే కాకుండా, పెద్ద ఎత్తున అసమ్మతిని ఆహ్వాన్నచిన్నట్లు కూడా కాగలదు.
More Stories
ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
కోల్కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్తో ప్లాన్… ఐఎస్ కుట్ర!