చిరంజీవికి క‌రోనా పాజిటివ్ … సీఎంలో కలకలం 

మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆచార్య షూటింగ్  ప్రారంభించేందుకు కోవిడ్ టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.

తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని చెబుతూవెంటనే హోం క్వారంటైన్ కు వెళ్లిన్నట్లు పేర్కొన్నారు.  గత ఐదు రోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టు చేయించుకోవాల్సిందిగా కోరారు. తన ఆరోగ్యం పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తానని తెలిపారు. 
 
కాగా,  మెగాస్టార్‌కు పాజిటివ్ రావడంతో తెలంగాణ సీఎంలో కలకలం రేగుతోంది. సీఎంవో అధికారులు అప్రమత్తమై కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం (నవంబర్ 7) చిరంజీవి,నాగార్జున ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి- విస్తరణపై చర్చ జరిగింది.
 
ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి ఈ సమావేశంలో  పాల్గొన్నారు.
 
అయితే కొద్దిసేపటి క్రితమే ఎంపీ సంతోష్‌ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆదివారం నాడు ఎంపీ సంతోష్, హీరో రామ్‌చరణ్‌తో కలిసి చిరంజీవి మొక్కలు కూడా నాటారు.