తమిళనాడులో భారీగా నల్లధనం పట్టుబడింది. ఆదాయ పన్ను (ఐటీ) విభాగం చెన్నైలోని ఓ ఐటీ ఇన్‌ఫ్రా గ్రూపునకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహించి రూ.1,000 కోట్ల నల్లధనాన్ని గుర్తించింది. ఇందులో కొన్ని బినామీ ఆస్తులున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.
ఈ నెల 4న చెన్నైతోపాటు మదురైలోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి లెక్కచూపని రూ.1,000 కోట్ల ఆదా యాన్ని గుర్తించామని తెలిపింది. ఇందులో ఆదా యంగా అంగీకరించిన రూ. 337 కోట్లపై బినామీ, నల్లధన చట్టాల కింద చర్యలు చేపట్టామని వివరించింది.
ఈ గ్రూపునకు చెందిన ప్రధాన సంస్థ ఐదు డొల్ల కంపెనీలను స్థాపించి వాటిలోకి బోగస్ బిల్లుల ద్వారా రూ.337 కోట్ల నిధులను మళ్లించినట్టు గుర్తించామని సీబీడీటీ వెల్లడించింది. ఈ కంపెనీకి సింగపూర్‌లో రిజిస్టరైన మరో కంపెనీతో పెట్టుబడుల సంబంధం ఉన్నదన్న సమాచారంతో సోదాలు నిర్వహించినట్టు తెలిపింది.
ఐటీ ఇన్‌ఫ్రా గ్రూపునకు సంబంధించిన కంపెనీ వాస్తవానికి చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పటికీ 72 శాతం వాటా కలిగి ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. మిగిలిన మొత్తం పెట్టుబడులు పెట్టిన మరో కంపెనీకి కేవలం 28 శాతం వాటా మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు జరిపి 2015 నల్లధన చట్టం ప్రకారం చర్యలు చేపట్టనున్నట్టు సీబీడీటీ అధికారులు వివరించారు.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ