బైడెన్ కోవిద్ టాస్క్ ఫోర్స్ లో వివేక్ మూర్తి!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమోక్రాటిక్ అభ్యర్థి మొదట కోవిద్ మహమ్మారిని కట్టడి చేయడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. తన తొలి ప్రసంగంలోని కరోనాపై తన పోరు సాగిస్తామని వాగ్దానం చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 
 
దీని నిమిత్తం ఒక టాస్క్‌ ఫోర్స్‌ను బిడెన్‌ ఏర్పాటు చేయనున్నారు  ఈ టాస్క్‌ఫోర్స్‌కు భారత సంతతికి చెందిన ఫిజిషియన్‌ డా. వివేక్‌ మూర్తి సహా అధ్యక్షులుగా వ్యవహరించనున్నారని తెలుస్తున్నది. దీనిపై సోమవారం బిడెన్‌ ప్రకటించే అవకాశాలున్నాయి. 
 
43 ఏళ్ల వివేక్‌ భారత మూలాలు కర్ణాటకలో ఉన్నాయి. వివేక్‌ బ్రిటన్‌లో జన్మించారు. 2014లో అమెరికా 19వ సర్జన్‌ జనరల్‌గా అప్పటి అధ్యక్షుడు ఒబామా నియమించారు. కాగా, ఆ పదవికి ఎన్నికైన అత్యంత చిన్న వయస్కుడు (37 ఏళ్లకు) కూడా ఆయనే కావడం విశేషం.
 
ట్రంప్‌ ఎన్నికైన తర్వాత ఆ పదవి నుండి వైదొలగాలని అప్పటి యంత్రాంగం కోరడంతో రాజీనామా చేశారు.  బిడెన్‌- కమలా హారీస్ ‌(ఉపాధ్యక్ష అభ్యర్థి) కోవిడ్‌ ప్రణాళికను అమలు చేసేందుకు సాయం నిమిత్తం శాస్త్రవేత్తలు, నిపుణుల నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, వారు పేర్లను ప్రకటిస్తానని ప్రకటించారు.
కాగా, ఈ టాస్క్‌ ఫోర్స్‌ ఎవరి నేతృత్వంలో నడుస్తుందో బిడెన్‌ చెప్పలేదు. కానీ, స్థానిక పత్రిక వాషింగ్టన్‌ పోస్టు కథనం ప్రకారం డా. వివేక్‌, మాజీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ డేవిడ్‌ కెస్సియర్‌ సహా అధ్యక్షులుగా ఉంటారని చెబుతున్నారు.