46వ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్  

అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ శనివారం విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న అయిదు కీలక రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బైడెన్ విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు. 

పెన్సిల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అక్కడ జోబైడెన్ ఆధిక్యత కనబర్చడంతోఅమెరికా అధ్యక్ష ఎన్నికపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది. ఈ విజయంతో జో బైడెన్‌కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. నెవాడాలోనూ విజయం సాధించడంతో ఇది 290కి పెరిగింది. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు.

కాగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ ఎన్నికయ్యారు. అంతేకాదు అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ఆసియన్ అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.

నార్త్ కరోలినా ఫలితం తేలకపోవడంతో ట్రంప్‌కు ఇప్పటివరకు 214 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి.దీనిపై ట్రంప్ మొదట్లో ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు కానీ ఆ తర్వాత మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ‘బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నట్లుగా కనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

అంతకు ముందు ట్రంప్ వైట్‌హౌస్‌నుంచి వర్జీనియాలోని గోల్ఫ్‌కోర్స్‌కు బయలుదేరి వెళ్లేముందు కూడా నేను ఈ ఎన్నికలో బోలెడంత మెజారిటీతో గెలుపొందాను’ అంటూ ట్వీట్ చేశారు. అయితే పెన్సిల్వేనియా ఫలితంతో ట్రంప్ రెండో సారి అధ్యక్షుడయ్యే అవకాశం లేకుండా చేసేసింది. జో బైడెన్ విజయం సాధించడంతో గత అయిదు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

బైడెన్‌కు మొత్తం 74,478,345 ఓట్లు వచ్చాయి. ఈ విధంగా 50.5 శాతం బలంతో నిలిచారు. అమెరికన్లు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం గర్వకారణమని, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పడిన విభేదాలన్నీ మరిచిపోయి ఒక దేశంగా సంఘటితంగా ఉండాల్సిన సమయమిదని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పేర్కొన్నారు.

‘అమెరికా ప్రజలు నాపైన, ఉపాధ్యక్షురాలిగా కమలా మారిస్‌పైన ఉంచిన విశ్వాసానికి నేనెంతో కృతజ్ఞుడిని కనీ వినీ ఎరుగని అడ్డంకుల నడుమ రికార్డు సంఖ్యలో అమెరికన్లు ఓటేశారు’ అని బైడెన్ ఒక ట్వీట్‌లో తెలిపారు.

ప్రచారం ముగిసి పోయినందున కోపాన్ని, విద్వేష ప్రసంగాలను పక్కన పెట్టి ఒక దేశంగా ఒక్కటి కావలసిన సమయం వచ్చింది. అమెరికా ఏకం కావలసిన, గాయాలు మాన్పుకోవలసిన సమయం ఇది. మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనం గనుక కలిసి చేస్తే మనం చేయలేనిది ఏదీ లేదు’ అని ఆ ట్వీట్‌లో ఆయన సందేశం ఇచ్చారు.