ఇక వాట్సప్‌ లో డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలు   

ఇప్పటి వరకు కమ్యూనికేషన్‌ సేవలను అందిస్తున్న వాట్సప్డి ఇప్పుడు జిటల్‌ పేమెంట్స్‌ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. టెక్స్‌, వాయిస్‌, వీడియో సందేశాలతో కోట్లాది మంది భారతీయులను తమ యూజర్లుగా మార్చుకున్న ఈ ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థ ఇప్పుడు భారత్‌లో చెల్లింపు సేవలను ప్రారంభించింది.
నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి అనుమతులు అందుకున్న నేపథ్యంలో దేశంలో పేమెంట్స్‌ సర్వీసులను మొదలు పెట్టినట్లు శుక్రవారం వాట్సప్‌ తెలియజేసింది. దేశీయంగా 2018లోనే యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారిత పేమెంట్స్‌ సర్వీస్‌ను వాట్సప్‌ పరీక్షించడం మొదలు పెట్టింది. సుమారు 10 లక్షల వినియోగదారులతో ఈ ప్రక్రియ కొనసాగగా, ఎట్టకేలకు గురువారం యూపీఐ ఆధారిత సేవలకు ఎన్‌పీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
వాట్సప్‌ డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల్లోకి రావడం ఇప్పటికే ఉన్న ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీగానే పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు కారణం భారత్‌లో వాట్సప్‌కున్న విశేష ఆదరణే. దేశంలో వాట్సప్‌ యూజర్ల సంఖ్య 40 కోట్లకు పైగా ఉన్నారు. దీంతో పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే, అమెజాన్‌ పే వంటి సంస్థలకు పోటీ పెరుగవచ్చని భావిస్తున్నారు.
ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లతోపాటు జియో పేమెంట్స్‌ బ్యాంక్‌తో వాట్సప్‌ అనుసంధానంగా పనిచేయనున్నది. దీంతో యూపీఐ ఆధారిత యాప్‌తో ఇప్పుడున్న ఇతర డిజిటల్‌ పేమెం ట్స్‌ యాప్‌ల తరహాలోనే వాట్సప్‌ నుంచీ ఇతరులకు, దుకాణదారులకు ఇతరత్రా అన్నిచోట్ల నగదు లావాదేవీలు జరుపవచ్చు. 
 
కాగా, ఇది సురక్షితమైన సర్వీస్‌ అని, దీనికి ఎలాంటి రుసుములు ఉండబోవని ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఓ వీడియో సందేశంలో తెలిపారు.