క‌ర్నాట‌క‌లో ల‌వ్ జిహాద్‌ను అంతం చేస్తాం

క‌ర్నాట‌క రాష్ట్రంలో ల‌వ్ జిహాద్‌ను అంతం చేయనున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ య‌డ్యూర‌ప్ప వెల్లడించాయిరు. ల‌వ్ జిహాద్‌ను రూపుమాపేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. డ‌బ్బు, ప్రేమ పేరుతో రాష్ట్రానికి చెందిన చాలామంది యువతులను మోసం చేస్తున్నారని చెబుతూ అటువంటి వారిని  అడ్డుకుంటామ‌ని స్పష్టం చేశారు. 
 
ల‌వ్ జిహాద్ ఓ సామాజిక రుగ్మ‌త అని, దాన్ని రూపుమాపేందుకు ఓ చ‌ట్టాన్ని తేవాల‌ని చూస్తున్న‌ట్లు హోంమంత్రి బ‌స‌వ‌రాజ్ ఇప్పటికే తెలిపారు. లవ్ జిహాదీ కట్టడికి ఒక చట్టం తీసుకు రాబోతున్నట్లు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి సిటీ రవి కూడా ప్రకటించారు. 
 
ల‌వ్ జిహాద్ పేరుతో రాష్ట్రంలో జ‌రుగుతున్న మ‌త మార్పుడ‌ల గురించి మీడియాలో అనేక క‌థ‌నాల‌ను చూశామ‌ని ముఖ్యమంత్రి చెప్పారు.  దీని గురించి అధికారుల‌తో చ‌ర్చిచామ‌ని చెబుతూ అయితే  ఇత‌ర రాష్ట్రాల‌కు గురించి త‌న‌కు తెలియ‌ద‌ని పేర్కొన్నారు. కానీ క‌ర్నాట‌క‌లో మాత్రం ల‌వ్ జిహాద్‌ను అంతం చేస్తామ‌ని సీఎం య‌డ్డీ స్పష్టం చేశారు. 
 
ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా లవ్‌ జిహాదీ అనే అంశం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కేవలం వివాహం కోసం మతమార్పిడి చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్న అలహాబాద్‌ కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ తారస్థాయికి చేరుకుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో లవ్‌ జిహాద్‌కు అడ్డుకట్ట వేసే దిశగా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోనున్నాయనే వార్తలు వెలువడుతున్న తరుణంలో కర్ణాటక సీఎం యడియూరప్ప ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.   
 
బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హర్యానా ముఖ్యమంత్రులు ఇప్పటికే లవ్ జిహాదీ కట్టడికి చట్టాలు తీసుకు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.