పటాకులు పేల్చడంపై పలు రాష్ట్రాలలో ఆంక్షలు 

పలు పండుగల సంబరాలను దూరం చేసిన కరోనా మహమ్మారి తాజాగా దీపాల హరివిల్లు దీపావళి ముచ్చట్లను సహితం లేకుండా చేస్తున్నది. దేశంలోని పలు రాష్ట్రాలు వరస పెట్టి దీపావళి సందర్భంగా టపాసులు కాల్చటంపై నిషేధం విధిస్తున్నాయి. 

టపాసులు పేల్చటం ద్వారా వచ్చే కాలుష్యం కరోనా కేసులను మరింత పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించటంతో పలు రాష్ట్రాలు దీపావళిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

దీపావళి పండుగ నేపథ్యంలో పటాకులు అమ్మినా లేక కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ హెచ్చరించారు.  పటాకులు అమ్ముతున్న లేదా కాల్చినట్టుగా కనిపించిన వ్యక్తులపై గాలి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981 కింద కేసులు నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు.

ఈ చట్టం కింద గరిష్ఠంగా రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చని మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. పటాకుల నిషేధంపై కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ సంస్థ, పర్యావరణ శాఖ, ఢిల్లీ పోలీసులతో కలిసి సోమవారం సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

మరోవంక, దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడాన్ని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తెలిపారు. కోవిడ్ -19, ఇతర కారణాల వల్ల ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడాన్ని నిషేధించాలని తాము  నిర్ణయించామని సీఎం చెప్పారు. ఈ నిర్ణయం తీసుకునే ముందుసవివరంగా సమాలోచనలు జరిపామని సీఎం పేర్కొన్నారు.

దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ప్రభుత్వం దీపావళి విషయమై పౌరులకు హెచ్చరిక ప్రకటన చేసింది. రాష్ట్ర రాజధాని ముంబైలో టపాకులు పేల్చడాన్ని నిషేధిస్తున్నట్లు బృహత్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.

కాళీ పూజ, దీపావళి, చాట్ పూజ పర్వదినాల సందర్భంగా అన్ని రకాల టపాకాయలు పేల్చడంపై నిషేధం అమలు జరపాలని పశ్చిమ బెంగాల్ హై కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. ఒడిశా, రాజస్థాన్ ప్రభుత్వాలు సహితం ఈ పండుగ సమయంలో టపాకాయల అమ్మకాలు, పేల్చడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేశాయి.

నవంబర్ 7 నుండి 30 వరకు టపాకాయలు పేల్చడంను నిషేధించే విషయమై ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది.