చైనాతో యుద్ధానికి గల అవకాశాలను తోసిపుచ్చలేం 

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన ధీన రేఖ (ఏల్ఏసీ) వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, చైనాతో యుద్ధానికి గల అవకాశాలను తోసిపుచ్చలేమని  భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. అదే సమయంలో వాస్తవాధీన రేఖలో ఎలాంటి మార్పును భారత్ అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. 

శుక్రవారం ఇరు దేశాల మధ్య 8వ రౌండ్ మిలటరీ స్థాయి చర్చలు మొదలైన నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  ‘తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. లద్దాఖ్‌లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసానికి పాల్పడి, ఊహించని ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. మన సైన్యం ఎంతో ధైర్యంగా నిలబడి చైనాకు గట్టి జవాబిచ్చింది’ అని రావత్  కొనియాడారు. 

సరిహద్దు ఘర్షణలు, చొరబాటులు, ఎలాంటి కవ్వింపులు లేకుండా వ్యూహాత్మక సైనిక చర్చలు వంటివి సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్నందున దేన్నీ తేలికగా తీసుకోమని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని సరిహద్దులు దాటించేందుకు పాక్ జరిపే యత్నాలను కూడా భారత ఆర్మీ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయని తెలిపారు. 

భద్రతా సవాళ్లను ప్రస్తావిస్తూ, అణ్వాయుధ సంపత్తి గల రెండు పొరుగు దేశాలతో ఘర్షణల కారణంగా ప్రాంతీయ వ్యూహాత్మక అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రెండు పొరుగు దేశాలు యుద్ధానికి కాలు దువ్వుతున్నా భారత్ సంయమనంగానే వ్యవహరిస్తోందని చెప్పారు.

భారత వ్యతిరేక శక్తులతో కలిసి జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌ అప్రతిహతంగా పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని, దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా క్షీణించాయని పేర్కొన్నారు. సరిహద్దు వివాదంపై చైనా వైఖరిని ప్రస్తావిస్తూ, చైనాతో అనేక విడతలుగా చర్చలు జరిపినా ఇంతవరకూ ఎలాంటి ఫలితం రాలేదని విచారం వ్యక్తం చేశారు.