అనారోగ్యంతో రాజీనామా బాటలో పుతిన్ !

రష్యాలో దాదాపు రెండు దశాబ్దాలుగా పాలన సాగించిన  అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్కిన్స‌న్స్ వ్యాధితో బాధపడుతూ ఉన్నందున తన పదవికి వచ్చే జనవరిలో రాజీనామా చేయడానికి సిద్దపడుతున్నారని వార్త కధనాలు వెలువడుతున్నాయి. 

 పుతిన్ మాజీ జిమ్నాస్ట్ లవర్ అలినా కబేవా ఆయనను అధికార బాధ్యతల నుంచి దూరం జరగాలని కోరుతున్నట్టు ‘ది సన్’ కథనం పేర్కొంది. ఇటీవల విడుదలైన ఓ వీడియోలో పుతిన్ తరచూ తన కాలు అటూ ఇటూ కదుపుతున్నట్టు కనిపించింది. 

దీంతో విపరీతమైన నొప్పి కారణంగానే ఆయన కాలు కదుపుతున్నట్టు నిపుణులు పేర్కొన్నట్టు ది సన్ పేర్కొంది. కుర్చీ ఆర్మ్ రెస్ట్‌ను ప‌ట్టుకుంటే ఆయ‌న చేతులు నొప్పిపెడుతున్న‌ట్లు తెలుస్తున్న‌ద‌ని, చివ‌రికి పెన్ను, టీ క‌ప్పు ప‌ట్టుకోవాల‌న్నా పుతిన్ నొప్పిని ఫీల‌వుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతున్నద‌ని ప‌రిశీల‌కులు చెప్పిన‌ట్లు ది యూఎస్ స‌న్ పేర్కొన్న‌ది. 

ఈ వీడియోపై రకరకాల చర్చలు కొనసాగుతుండగానే పుతిన్‌కు పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు ఉన్నాయంటూ  ర‌ష్యాకు చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడు వాలెరీ సొలోవెయ్ పుతిన్‌కు పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు ఉన్నాయంటూ వెల్లడించారు. 

న్యూయార్క్ పోస్ట్‌లో కూడా ప్రచురితమైన కధనంలో అనారోగ్యం రీత్యా ప‌ద‌వి నుంచి వైదొలిగి విశ్రాంతి తీసుకొమ్మ‌ని కుటుంబ‌స‌భ్యులు 68 ఏండ్ల‌ పుతిన్‌పై ఒత్తిడి చేస్తున్నార‌ని సొలోవెయ్ వెల్ల‌డించారు. త‌న‌ 37 ఏండ్ల గ‌ర్ల్ ఫ్రెండ్ అలినా క‌బ‌యెవా, ఇద్ద‌రు కుమార్తెల ఒత్తిడి కార‌ణంగా పుతిన్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని యోచిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని పుతిన్ జ‌న‌వ‌రిలో ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు.

కాగా, ఇప్ప‌టికే ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న ట్రంప్ త్వ‌ర‌లో ర‌ష్యాకు కొత్త ప్ర‌ధానిని నియ‌మించ‌బోతున్నార‌ని, ఆ కొత్త‌గా నియామ‌కం కాబోయే వ్య‌క్తే పుతిన్ త‌ర్వాత ఆ దేశ అధ్య‌క్షుడు కానున్నార‌ని న్యూయార్క్ పోస్ట్ ప్ర‌చురించింది. ర‌ష్యా అధ్య‌క్ష కార్యాల‌య సిబ్బంది మాత్రం ఈ వార్త‌ల‌ను కొట్టిపారేశారు. అవ‌న్నీ కేవ‌లం ఊహాగానాలేనని పేర్కొన్నారు.

దీనికి తోడు అనూహ్యంగా పుతిన్ మరో కొత్త చట్టాన్ని తీసుకురావడంతో.. ఆయన తప్పుకోవడం ఖాయమన్న ప్రచారం మరింత జోరందుకుంది. శాశ్వతంగా సెనేటర్‌గా ఉండేలా తీసుకొచ్చిన ఈ నూతన చట్టం ప్రకారం.. పుతిన్‌కు జీవిత కాలం పాటు దేశం నుంచి అన్ని అధికారిక సదుపాయాలు ఉంటాయి.  పైగా,   రష్యాకు శాశ్వతంగా తానే అధ్యక్షుడిగా కొనసాగేలా పుతిన్ ఇటీవల రాజ్యాంగ సవరణకు ప్రతిపాదించారు. 

కాగా, ర‌ష్యా మాజీ అధ్య‌క్షులకు జీవిత‌కాలంపాటు క్రిమిన‌ల్ ప్రాసిక్యూష‌న్ నుంచి ఇమ్యూనిటీ క‌ల్పించే బిల్లుకు అక్క‌డి ఎంపీలు ఆమోద‌ముద్ర వేయ‌బోతున్న త‌రుణంలో ఈ ఊహాగానాలు వెలువ‌డటం గ‌మ‌నార్హం.     ‌