ఎస్సీ హోదా దుర్వినియోగం అంశంలో పాస్టర్లపై చర్యలకు కేంద్రం ఆదేశం 

ఆంధ్రప్రదేశ్: కరోనా లాక్-డౌన్ సమయంలో  ప్రభుత్వం ఇచ్చిన 5 వేల ఆర్ధిక సహాయం స్వీకరించిన పాస్టర్లలో 70 శాతం మంది హిందూ ఎస్సీ, ఓబీసీ కులధ్రువీకరణ పత్రాలు కలిగివుండటంపై లీగల్ రైట్స్ ఇచ్చిన నివేదికపై స్పందించిన కేంద్ర సామజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ, రిజర్వేషన్లు దుర్వినియోగానికి పాల్పడిన క్రైస్తవ పాస్టర్లపై చర్యలు తీసుకుని, ఆ చర్యల తాలూకు వివరాలు తమకు పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ విభాగానికి చెందిన ప్రధాన  కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.  

వివరాల్లోకి వెళితే.. లాక్-డౌన్ సమయంలో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించింది. ఇదే క్రమంలో పాస్టర్లు, ఇమాంలు, అర్చకులకు కూడా కేంద్రం ఇచ్చిన కరోనా ఫండ్ నుండి రూ 5 వేలు చొప్పున ఇచ్చింది. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పరిశోధనాత్మక నివేదికను కేంద్ర సామజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖకు సమర్పించింది. 

లాక్-డౌన్ సమయంలో ప్రభుత్వం నుండి రూ. 5వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందుకున్న 29,800 మంది పాస్టర్లలో దాదాపు 70 శాతం మంది పాస్టర్లు హిందూ ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్లు కలిగివున్న విషయం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ నివేదికలో వెల్లడించింది. గతంలో బాప్టిజం తీసుకుని, పాస్టర్ ట్రైనింగ్ పొందిన అనేక మంది పాస్టర్లు ఇప్పటికీ ఎస్సీ హోదా అనుభవిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది.
1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం మతం స్వీకరిస్తే తన ఎస్సీ హోదా కోల్పోతాడు. కానీ ఇక్కడ  ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం పొందిన పాస్టర్లలో అనేకమంది ఎస్సీ సర్టిఫికెట్లు కలిగివుండటం గమనార్హం. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్రాన్ని కోరింది.