గురువారం రాత్రి వరకు ట్రంప్ ఆధిక్యతలో ఉండిన పెన్సిల్వేనియాలోను శుక్రవారం బైడెన్ ఆధిక్యత సాధించారు. ఇక ఓట్ల లెక్కింపు జరుగుతున్న మిగతా మూడు రాష్ట్రాల్లో రెండు చోట్ల బైడెన్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఒక్క అలస్కాలో మాత్రమే ట్రంప్ గెలిచే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన జార్జియాలో ఇద్దరు అభ్యర్థులకు దాదాపు సమానంగా ఓట్లు రావటంతో రీకౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ట్రంప్‌పై బైడెన్ అతిస్వల్ప ఆధిక్యంలో ఉండటంతో ఓట్లను తిరిగి లెక్కించాలని నిర్ణయించినట్టు జార్జియా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్‌పెర్జర్ ప్రకటించారు.
కాగా జార్జియాలో బైడెన్ గెలిస్తే సెనేట్‌లో డెమోక్రాట్ల బలం పెరుగుతుంది. అప్పుడు చట్టాలు ఆమోదించడానికి, కీలక నియామకాలు చేపట్టడానికి డెమోక్రాట్లకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒక వేళ జార్జియాలో డెమోక్రాట్లు ఓడిపోయి, బైడెన్ అధ్యక్షుడయితే మాత్రం సెనేట్‌లో ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఓటమి భయంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్‌కు న్యాయస్థానాల్లోను చుక్కెదురు తప్పడం లేదు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్‌ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్కమాలు జరిగాయని ఆరోపిస్తూ ట్రంప్ మద్దతుదారులు కోర్టులో ఓ పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే.
జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను వారు సవాలు చేశారు. ఈ క్రమంలో సరైన సాక్షాధారాలు లేవంటూ జార్జియా, మిషిగాన్ కోర్టులు ఈ పిటిషన్లను పరిగణనలోకి తీసుకోలేదు. జార్జియా కేసులో ఆలస్యంగా వచ్చిన 53 బ్యాలెట్లను ఆన్‌టైమ్ బ్యాలెట్లతో కలిపి లెక్కించినట్లు ట్రంప్ మద్దతుదారులు ఆరోపించారు. మిషిగాన్‌లో కూడా ఇదే కారణంతో ఓట్లను లెక్కించకుండా ఆపడానికి యత్నించారు.
అక్రమ బ్యాలెట్ల లెక్కింపును నిలిపివేసేవరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల ధ్రువీకరణ కోసం ఏ అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయ పోరాటంలో ఇది ఆరంభం మాత్రమే అన్నారు. అక్రమ ఓట్ల లెక్కింపును ఆపేవరకు ఒత్తిడి కొనసాగిస్తామని చెప్పారు.
More Stories
ఆసియా చాంఫియన్స్ హాకీ ట్రోఫీ విజేత భారత్
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్
రష్యాలో పిల్లల కోసం భోజన విరామంలో శృంగారం