.సగంకు మించి విద్యార్థుల హాజరు ఉండరాదు!

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా మూతపడిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలను తిరిగి తెరవడానికి యూజీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం విద్యార్థులలో 50శాతం కంటే ఎక్కువ మంది ఏ సమయంలోనైనా హాజరుకావద్దని స్పష్టం చేసింది. 

కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా దేశవ్యాప్తంగా మార్చి నుంచి విద్యా సంస్థలు మూసివేయబడ్డాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో సహా అన్ని ఇతర సంస్థలకు, భౌతిక తరగతులను ప్రారంభించాలని, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రకారం చేయాలని పేర్కొంది.

క్యాంపస్‌లను దశలవారీగా ప్రారంభించాలని విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కోరింది. సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లు వాడాలని, ఇతర రక్షణతో సహా కోవిడ్ -19 నిబంధనలకు కట్టుబడి ఉండాలని పేర్కొంది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు మాత్రమే తెరవడానికి అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేసింది.

కంటైన్‌మెంట్ జోన్లలో నివసిస్తున్న విద్యార్థులు,  సిబ్బందిని కళాశాలలకు హాజరుకావడానికి అనుమతించరు. కంటైన్ మెంట్ జోన్లలోకి వచ్చే ప్రాంతాలను సందర్శించవద్దని విద్యార్థులు మరియు సిబ్బందికి సూచించింది.

అధ్యాపకులు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు ‘ఆరోగ్యా సేతు యాప్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 16న దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు మూసివేయబడ్డాయి. దేశవ్యాప్తంగా మార్చి 25న లాక్‌డౌన్ ప్రకటించబడింది.