దుర్గ గుడి కార్యాలయంలో మంత్రి రాజకీయాలు 

ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని హిందూ దేవాలయాల పవిత్రతకు భంగం కలుగుతున్నట్లు సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతూ ఉండగా, ప్రసిద్ధి చేయండి విజయవాడ లోని దుర్గ గుడి పరిపాలన కార్యాలయాన్ని స్వయంగా దేవాలయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకొంటుండటం కలకలం రేపుతున్నది.

 బ్రాహ్మణవీధిలో ఉన్న దుర్గగుడి పరిపాలనా కార్యాలయాన్ని స్థానిక శాసన సభ్యుడైన వెలంపల్లికి సంబంధించిన అధికార పార్టీ సమావేశాలు జరుగుతూ ఉండడం వివాదంగా మారింది. 

తాజాగా  వైసీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో స్వయంగా దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, మంత్రి ముఖ్య అనుచరులు కొండపల్లి బుజ్జి, కొనకళ్ల విద్యాధరరావు పాల్గొనడం గమనార్హం.

బీసీ కార్పొరేషన్ల నియామకాల నేపథ్యంలో బీసీలను వైసీపీ వైపు ఆకర్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే ఊపులో నియోజకవర్గాలవారీగా ర్యాలీల నిర్వహణకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు.

అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమావేశం ఇక్కడ గురువారం జరిగింది. పార్టీ సమావేశానికి దుర్గగుడి పాలనా కార్యాలయాన్ని వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, ముఖ్యంగా ఈవో సురేశ్‌బాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆలయ పవిత్రత మంటగలుపుతున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి.

తాజాగా రాజకీయ సమావేశాలకు సైతం దుర్గగుడి పాలకమండలి కార్యాలయం వేదికగా మారడం, ఆలయ సొమ్ముతోనే ఇక్కడ సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఏడాది మే 17న పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులతో మంత్రి వెలంపల్లి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి కూడా దుర్గగుడి పరిపాలనా కార్యాలయంలోని సమావేశ మందిరాన్నే వేదికగా చేసుకున్నారు. 

నాటి సమావేశానికి ఈవో సురేశ్‌బాబు, వీఎంసీ ఎస్టేట్‌ అధికారి శ్రీధర్‌ కూడా హాజరవ్వడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి పరిపాలనా కార్యాలయంలో రాజకీయ సమావేశం నిర్వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.