జగన్ అక్రమాస్తుల కేసు 9కి వాయిదా 

జగన్ అక్రమాస్తుల కేసు 9కి వాయిదా 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్‌షీట్లపై విచారణ ఈనెల 9కి సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్ చార్జ్‌షీట్‌లో డిశ్చార్జ్ పిటిషన్‌పై జగన్ వాదనలు కొనసాగాయి. జగన్‌ తరఫున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

ఈడీ, సీబీఐ కేసుల విచారణ వేర్వేరుగా జరపాలన్న అంశంపై శుక్రవారం విచారిస్తారు. ఓఎంసీ అక్రమాల కేసు విచారణ ఈ నెల 10కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. గాలి జనార్దన్‌రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. గాలి బెయిల్ స్కాంపై విచారణ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ బుధ, గురు వారాలలో కొనసాగింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన కేసు లో జగన్‌ వేసిన డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు జరిగాయి. 

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి తాము పెట్టిన  కేసులపై విడిగా విచారణ చేపట్టవచ్చని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఇంతకు ముందే తెలిపింది. సీబీఐ కేసుల విచారణ ముగిసేంత వరకు ఈడీ కేసులను నిలుపుదల చేయాలని కోరుతూ జగన్‌ వేసిన పిటిషన్‌పై ఈడీ బుధవారం బుధవారం కౌంటర్‌ దాఖలు చేసింది. 

సీబీఐ పెట్టిన కేసుల ఆధారంగానే ఈడీ తనపై కేసులు నమోదు చేసిందని.. అందుకే సీబీఐ, ఈడీ కేసులను ఒకేసారి కాకుండా.. తొలుత సీబీఐ కేసులనే చేపట్టాలని పేర్కొన్నారు. 

అయితే ఈడీ కేసులు, సీబీఐ కేసు లు వేర్వేరని.. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినప్పటికీ.. ఇది ప్రత్యేక చట్టమని, మనీలాండరింగ్‌ యాక్టులోని సెక్షన్‌ 44 ప్రకారం.. సీబీఐ, ఈడీ కేసులను విచారించే అధికారం కోర్టుకు ఉంటుందని ఈడీ తరపు న్యాయవాది అఫిడవిట్లో స్పష్టం చేశారు.