గెలుపు బాటలో బైడెన్ ….. కోర్ట్ వైపు ట్రంప్ 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగి రెండు రోజులు గడిచినప్పటికీ  విజేత ఎవరన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లతో స్పష్టమైన ఆధిక్యతతో ఉంన్నారు. అయితే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలంటే మరో ఆరు ఓట్లు కావాల్సి ఉన్నది. 

తమ పార్టీకి కంచుకోటగా పిలిచే నెవాడా రాష్ట్రంలో ఉన్న ఆరు ఎలక్టోరల్‌ ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు బైడెన్‌కు మెండుగా ఉన్నాయి. మరోవైపు, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు 214 ఎలక్టోరల్‌ ఓట్లు లభించాయి. ఓట్ల సాధనలో వెనుకబడినప్పటికీ ఆయనకు కూడా విజయావకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి.

ఓట్ల లెక్కింపు ఆపివేయమని ట్వీట్ లు ఇస్తుండటం, కోర్ట్ లకు వెళ్ళడానికి సిద్దపడుతూ ఉండడంతో పరోక్షంగా ట్రంప్ పరాజయాన్ని అంగీకరించినట్లు అవుతున్నది. మళ్లీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలంటే కీలక రాష్ట్రాలైన జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, అలస్కాలోని అన్ని ఎలక్టోరల్‌ ఓట్లతో పాటు నెవాడాలోని ఓట్లను ట్రంప్‌ గెలువాల్సి ఉంటుంది. 

నెవాడా మినహా మిగతా రాష్ట్రాల్లోని  అన్ని ఓట్లను గెలిచినప్పటికీ, ట్రంప్‌ 268 ఎలక్టోరల్‌ ఓట్లను మాత్రమే సాధించగలరు. దీంతో అధికారాన్ని చేపట్టే అవకాశం ఉండదు.  అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 538 సభ్యులున్న ఎలక్టోరల్‌ కాలేజీలో కనీసం 270 ఎలక్టోరల్‌ ఓట్లు కావాలి. 

ఫలితాల్ని ప్రభావితం చేయగల జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, నెవాడా రాష్ట్రాల్లో ఇంకా ఫలితాలు వెల్లడి కాలేదు. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పోలింగ్‌ సమయంలో ఓటర్లు గుమిగూడే అవకాశమున్నదన్న కారణంతో ఈ రాష్ట్రాల్లోని ప్రజలు పెద్దఎత్తున ముందస్తు బ్యాలెట్‌ ఓటింగ్‌కు మొగ్గు చూపారు.  

మంగళవారం జరిగిన పోలింగ్‌లో కూడా ఓటర్లు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఓట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. అధ్యక్ష రేసులో క్రమంగా వెనుకబడుతున్న వేళ ట్రంప్‌.. గతంలో పలుమార్లు చెప్పినట్టుగానే కోర్టు తలుపులు తడుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తానని  చెబుతున్నారు. 

‘అన్ని చోట్ల ఓటింగ్‌ నిలిపివేయాలి. మేము సుప్రీం కోర్టుకు వెళ్తున్నాం’ అని  మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకటించారు. పెన్సిల్వేనియా, మిషిగన్‌, జార్జియాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు వద్దకు తమ పరిశీలకులను అనుమతించడం లేదని ట్రంప్‌ బృందం ఆయా రాష్ట్రాల కోర్టులను ఆశ్రయించింది. 

పెన్సిల్వేనియాలో ట్రంప్‌కు అనుకూలంగా అప్పిలేట్‌ జడ్జి తీర్పునిచ్చారు. కౌంటింగ్‌ జరిగే ప్రదేశం నుంచి కనీసం 6 అడుగుల దూరం వరకు పరిశీలకులను అనుమతించాలని అధికారులను ఆదేశించారు.  విస్కాన్సిన్‌లో రీకౌంటింగ్‌ నిర్వహించాలని ట్రంప్‌ బృందం కోరింది.  కాగా, జార్జియా, మిచ్‌గాన్‌ రాష్ట్రాల ఎన్నికల్లో అవతవకలు జరిగాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రచార ప్రతినిధి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది.  

మరోవైపు ట్రంప్‌ కోర్టుకు వెళ్తే న్యాయపోరాటానికి తాము కూడా పూర్తి సిద్ధంగా ఉన్నామని బైడెన్‌ క్యాంపెయిన్‌ పేర్కొన్నది. ఎన్నికల ఫలితాల ప్రకటనకు కీలకంగా మా రిన నెవాడా రాష్ట్రం పై కూడా ట్రంప్‌ బృందం గురువారం కోర్టును ఆశ్రయించింది. 

ఇదిలా ఉండగా, పోస్టల్‌ బ్యాలెట్‌లపై సుప్రీంకోర్టులోనూ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ట్రంప్‌ ఆశాభావంతో ఉన్నారు. పోలింగ్‌ తర్వాత కూడా ఓటింగ్‌ను అనుమతించాలన్న కొన్ని రాష్ట్రాల అభ్యర్థనను ఇటీవల సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు.