అమెరికాలో సత్తా చాటిన భారతీయ అమెరికన్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారి భారతీయ అమెరికన్ సమాజం గణనీయమైన శక్తిగా ఆవిర్భవించింది. అమెరికా చట్టసభ సభ్యులుగా భారతీయ అమెరికన్ అభ్యర్థులు నలుగురు డాక్టర్ అమీబిరా, ప్రమీలా జయపాల్, రోఖన్నా, రాజా కృష్ణమూర్తి మళ్లీ ఎన్నిక కావడం చరిత్ర సృష్టించింది. 

ఢిల్లీలో జన్మించిన రాజా కృష్ణమూర్తి 2016లో ప్రతినిధుల సభకు మొదటిసారి ఎన్నికయ్యారు. కృష్ణమూర్తి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వారు. వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నిక కాగా, కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదోసారి అమీబిరా ఎన్నికయ్యారు. మరో భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రోఖన్నా మూడోసారి గెలుపొందారు. 

వాషింగ్టన్ రాష్ట్రం నుంచి ప్రమీలా జయపాల్ మూడోసారి గెలుపొందారు. న్యూయార్క్ నుంచి 38 ఏళ్ల ఇండో అమెరికన్ న్యాయవాది జెనిఫర్ రాజ్‌కుమార్ విజయం సాధించారు. దక్షిణాసియా నుంచి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

వీరంతా డెమొక్రాటిక్ పార్టీవారే. కీలకమైన పోటీ స్థానాలుగా పరిగణించే ఫ్లోరిడా, జార్జియా, మిచిగన్, నార్త్ కెరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్ రాష్ట్రాల్లో దాదాపు 1.8 మిలియన్ మంది వరకు ఉన్న భారత్  అమెరికన్ సమాజం ఓటింగ్‌లో కీలక పాత్ర వహిస్తుంది. అందుకని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు వీరిని ఆకట్టుకోడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. భారత్  అమెరికన్ చట్టసభ సభ్యుల అనధికారిక సమూహాన్ని ‘సమోసా కాకస్’ కూటమి గా క్రిష్ణమూర్తి పిలుస్తుంటారు.

అరిజోనా జిల్లా నుంచి రిపబ్లికన్ అభ్యర్థికి పోటీగా రంగంలో ఉన్న డెమొక్రాటిక్ ఇండోఅమెరికన్ అభ్యర్థి డాక్టర్ హిరాల్ టిపిమెని ఆధిక్యతలో ఉన్నారు. హిరాల్ విజయం సాధిస్తే ‘సమోసా కాకస్’ మరింత బలపడుతుందని భావిస్తున్నారు. టిపిమెని (52) విజయం సాధిస్తే జయపాల్ (55) తరువాత చట్టసభ ప్రతినిధిగా ఎన్నికైన రెండో ఇండో అమెరికన్ మహిళా సభ్యురాలవుతారు. 

2016 ఎన్నికల్లో గెలిచిన మొదటి ఇండో అమెరికన్ మహిళ జయపాల్. సమోసా కాకస్ ప్రస్తుతం ఐదుగురు ఇండో అమెరికన్ సభ్యులతో ఉంది. వీరిలో నలుగురు చట్టసభ ప్రతినిధులు కాగా, డెమొక్రాటిక్ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ (హారిస్) సెనేట్ ప్రతినిధిగా ఉన్నారు. 

రాజా కృష్ణమూర్తి లిబెర్టేరియన్ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్ నెల్సన్ (30)ను సులువుగా ఓడించారు. నెల్సన్‌పై 71 శాతం ఓట్లు సాధించుకుని విజయం కైవసం చేసుకోగలిగారు. డాక్టర్ అమీబీరా (55) సమోసా కాకస్‌లో సీనియర్ సభ్యులు. కాలిఫోర్నియా నుంచి ఐదో సారి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి రిపబ్లికన్ బజ్‌పాటెర్సన్ (65)పై 25 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు.