యజమాని అనుమతి లేకున్నా సౌదీ విడవచ్చు 

సౌదీ అరేబియా కార్మిక చట్టాల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. కఫాలా కార్మిక విధానంలోని కఠినమైన ఆంక్షలను తొలగించింది. దీంతో అక్కడ పని చేస్తున్న లక్షలాది మంది వలస కార్మికులకు ఊరట కలగనుంది. చట్టాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను మానవ వనరులు, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ   ప్రకటించింది. 

ఇక నుంచి వలస కార్మికులు  ఉద్యోగం మానేయాలంటే యజమాని  అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లు వేరే ఉద్యోగంలో చేరవచ్చు. స్పాన్సర్ షిప్ ను ఒక యజమాని  నుంచి మరో యజమానికి బదిలీ  చేసుకోవచ్చు. అదే విధంగా దేశం విడిచి వెళ్లాలంటే యజమాని అనుమహతి  అక్కర్లేదు. యజమాని  ప్రమేయం లేకుండానే ఆ దేశానికి రావొచ్చు, పోవొచ్చు. 

ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది మార్చి నుంచి అమల్లోకి వస్తాయని ఆ దేశ మంత్రి తెలిపారు. ఈ సంస్కరణలతో కోటి మంది వలస కార్మికులకు  ఊరట కలుగుతుందని చెబుతున్నారు. 

కాగా, సౌదీ కఫాలా సిస్టమ్ లో మార్పులు చేసినప్పటికీ, దాన్ని పూర్తిగా రద్దు చేయలేదని హ్యూమన్ రైట్స్ రీసెర్చర్ రోత్నా బేగమ్ పేర్కొన్నారు. విదేశీ కార్మికులు సౌదీకి వెళ్లాలంటే ఇప్పటికీ ఎంప్లాయర్ స్పాన్సర్ షిప్ అవసరమని చెప్పారు. దాని ద్వారా ఎప్పటిలాగే ఉద్యోగులపై యజమానులు  పెత్తనం ఉంటుందని స్పష్టం చేశారు.