ఇప్పటికే ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సొంతం చేసుకున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ వైట్ హౌస్‌కు ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో నిలిచారు. బైడెన్ ఇప్పటివరకు 264 ఓట్లు సాధించగా, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ విజయానికి మరో ఆరు ఎలక్టోరల్ ఓట్లు రావాల్సి ఉన్నది.
అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, అందులో 270 ఓట్లు గెలిచినవారే విజేతగా నిలుస్తారు. మొత్తం 50 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా, ఇప్పటివరకు 45 రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మరో 5 రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, నెవాడా, అలస్కాలో ఇంకా ఫలితాలు రావాల్సి ఉన్నది. ఇందులో పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కలోలినా, అలస్కాలో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, నెవాడాలో బైడెన్ ముందంజలో ఉన్నారు.
అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న బైడెన్ ఇప్పటికే మిషిగన్ (16), కాలిఫోర్నియా (55), న్యూయార్క్ (29), న్యూజెర్సీ (14), వర్జీనియా (13), వాషింగ్టన్ (12), ఇల్లినోయ్ (20), ఆరిజోనా (11), మసాచుసెట్స్ (11), మిన్నెసొటా (10), మేరీలాండ్ (10), కొలరాడో (9), కనెక్టికట్ (7), ఓరెగన్ (7), న్యూమెక్సికో (5), న్యూహాంప్‌షైర్ (4), రోడ్ ఐలండ్ (4), డీసీ (3), వెర్మాంట్ (3), డెలవెర్ (3), హవాయి (4), విస్కాన్సిన్ (10) రాష్ట్రాల్లో విజయం సాధించారు.
స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా (20), జార్జియా (16), నార్త్ కరోలినా (15), అలస్కా (3)లో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే టెక్సాక్ (38), ఫ్లోరిడా (29), ఒహయో (18), టెన్నెస్సీ (11), ఇండియానా (11), మిస్సోరి (10), అలబామా (9), సౌత్ కరోలినా (9), లూసియానా (8), ఓక్లహామా (7) కెంటకి (8) రాష్ట్రాలు ట్రంప్ ఖాతాలో పడ్డాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిగా బైడెన్ రికార్డు సాధించారు. ఒబామా పేరిట ఉన్న రికార్డును బైడెన్ అధిగమించారు. 2008 ఎన్నికల్లో ఒబామా 6,94,98,516 ఓట్లు సాధించారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. అయితే ఒకటి రెండు రాష్ట్రాల్లో ఓట్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగా, మరో రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. దీంతో ఫలితాలు వెలువడటానికి మరికొంత సమయం పట్టనుంది.
నార్త్ కరోలీనా (15) రాష్ట్రంలో ఈనెల 12 వరకు మెయిల్ బ్యాలెట్ల స్వీకరించనున్నారు. దీంతో అక్కడ ఫలితాలు ఈనెల 12 తర్వాతే రానున్నాయి. అలస్కా (3)లో మరో వారంపాటు కౌటింగ్ కొనసాగనుంది. పెన్సిల్వేనియా (20), జార్జియా (16)లో ఇవాళ సాయంత్రానికి ఫలితం వచ్చే అవకాశం ఉన్నది.
ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ నార్త్ కరోలినాలో ప్రస్తుతం 7 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా జార్జియాలో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్‌పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
హసీనా మేనకోడలు బ్రిటన్ మంత్రిగా రాజీనామా