అమెరికా ఎన్నిక భారత్ పై ప్రభావం చూపదు 

అమెరికా ఎన్నిక భారత్ పై ప్రభావం చూపదు 

భారత్‌తో ఉన్న సంబంధాలను అమెరికా అధ్యక్ష ఎన్నికల  ఫలితం పెద్దగా ప్రభావితం చేయదని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా స్పష్టం చేశారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌లలో ఎవరు గెలిచినా ద్వైపాక్షిక బంధం గతంలో మాదిరిగానే కొనసాగుతుందని భావిస్తున్నట్లు భరోసా వ్యక్తం చేశారు. 

ప్రధాని మోదీకి ట్రంప్‌తో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా దేశ ప్రయోజనాల కోసం దౌత్య విధానాలు రూపుదిద్దుకుంటాయని చెప్పుకొచ్చారు. 

‘‘అమెరికాతో మన బంధం పరస్పర మద్దతు, సహాయసహకారాలపై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్‌(అమెరికా చట్టసభలు)లోనూ, ప్రజా వ్యవహరాలను పరిశీలించినట్లయితే ఈ విషయం అర్థమవుతుంది” అని పేర్కొన్నారు.

కాలక్రమంలో ఎన్నెన్నో పరీక్షలకు తట్టుకుని ద్వైపాక్షిక బంధం నేటికీ కొనసాగుతోందని చెప్పారు. సమగ్రమైన, బహుముఖ దౌత్య విధానాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. విలువలు, విధానాల్లో మాత్రమే కాదు వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలోనూ పరస్పర అవగాహనతో సంబంధాలను మెరుగుపరచుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల గురించి విలేకర్లు ప్రశ్నించగా‘‘అక్కడి పరిస్థితులు నిజంగానే కాస్త ఉద్రిక్తంగా ఉన్నాయి. అవి ఇరు దేశాల మధ్య ఉన్న బంధంపై ప్రభావం చూపుతాయి. అయితే దీనికంతటికి చైనా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు, యథాతథ స్థితిని మార్చేందుకు చేసిన దుందుడుకు ప్రయత్నాలే కారణం’’ అని శ్రింగ్లా బదులిచ్చిరు.

 అదే విధంగా చైనా, భారత భూభాగాన్ని ఆక్రమించిందా అన్న ప్రశ్నలకు స్పందిస్తూ సరిహద్దుల్లో బలగాలు ప్రస్తుత స్థానాల నుంచి ముందుకు రావడం వంటి కవ్వింపు చర్యలు దౌత్య సంబంధాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశారు.

చైనా ఆర్మీ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నామని చెబుతూ  ప్రాంతీయ సమగ్రత, మన సార్వభౌమత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తేల్చి చెప్పారు. 

ఇదిలా ఉండగా.. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టే లక్ష్యంతో ఏర్పాటైన క్వాడ్‌ దేశాల(క్వాడ్రిలాటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌- భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌) విధానం గురించి మాట్లాడుతూ.. పరస్పరం సహకరించుకుంటూ, స్వేచ్చాయుత వాతావరణం, సుస్థిరత నెలకొల్పడమే ధ్యేయంగా నాలుగు దేశాలు ముందుకు సాగుతున్నట్లు శ్రింగ్లా వెల్లడించారు.