అర్న‌బ్ గోస్వామిపై మరో కేసు 

రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామిపై ముంబై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీస్‌ అధికారులను అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించింనందుకు అర్నబ్‌తోపాటు ఆయన భార్యపై పలు సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.
 రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో 2018లో 53 ఏండ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అన్వే నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్న కేసునకు సంబంధించి ముంబై పోలీసులు బుధవారం అర్నబ్‌ను అరెస్ట్‌ చేశారు.
అయితే ఈ సందర్భంగా అర్నబ్‌తోపాటు ఆయన భార్య, పోలీసులపై అనుచితంగా ప్రవర్తించారని, మహిళా పోలీస్‌ పట్ల చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు ఇద్దరు పోలీస్‌ అధికారులు తనపై దాడి చేసినట్లు అర్నబ్‌ ఆరోపించారు. అర్నబ్‌ కుటుంబ సభ్యలును కూడా పోలీసులు తోసివేశారని, ఆయన ఇంటిని మూడు గంటల పాటు దిగ్బంధించారని ఆయన తరఫు న్యాయవాది గౌరవ్ పార్కర్ పేర్కొన్నారు.   
 
అర్నబ్‌ గో స్వామిని బుధవారం అరెస్టు చేయడంపై ఉద్దర్‌ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఎం ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. అర్నబ్‌ గొంతును మూగబోయేలా చేస్తున్నారని పేర్కొంది.  శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ 1977లో ఎమర్జెన్సీ విధించారనీ, కానీ అది ప్రస్తుతం కూడా కొనసాగుతోందని ట్విట్టర్‌ ద్వారా విమర్శించారు.
 
ఎమర్జెన్సీ మద్దతుదారులు కాంగ్రెస్, శివసేనలపై గొంతెత్తి ప్రశ్నించేవారి స్వేచ్చకి భంగం కలిగిస్తున్నారని, ఇలాంటి వారితో దేశం పోరాటం చేస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఫడ్నవిస్‌ ధ్వజమెత్తారు. 
 
ముంభైలో బీజేపీ ఎమ్మెల్యే ఆశీష్‌ శెలార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. అర్నబ్‌ వంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తారని, సొంత ప్రయోజనాల కోసం ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వం వీరి గొంతును కట్టిపడేస్తూ, వారి స్వేచ్చకి భంగం కలిగిస్తుందని ఆరోపించారు. 
 
శివసేన నేతృత్వంలోని ఎంవీఎం ప్రభుత్వం జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తోందని, అర్నబ్‌ విషయంలోనూ ఇదే విధంగా ప్రవర్తిస్తూ, ఆత్మహత్య కేసు ఇప్పటికే పూర్తయిన, దానిని తిరిగి లేవనెత్తిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి ఇదొక బ్లాక్‌ డే అని ఆశీష్‌ వ్యాఖ్యానించారు.