ఇవే చివరి ఎన్నికలు …. నితీష్ సంచలన ప్రకటన 

తనకు ఇవే చివరి ఎన్నికలని బీహార్‌ ముఖ్యమంత్రి, జెడియు అధినేత  నితీశ్‌ కుమార్‌ సంచలన ప్రకటన చేశారు. పూర్ణియలోని ధమ్ధహా ఎన్నికల సభలో గురువారం మాట్లాడుతూ  ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే తాను పోటీ చేసే చివరి ఎన్నికలని తెలిపారు.
 
 ‘దయచేసి తెలుసుకోండి. ప్రచారానికి ఇవాళే చివరి రోజు. ఎల్లుండి ఓటింగ్‌. ఇదే నా చివరి ఎన్నిక. అంతా బాగానే ముగుస్తుంది’ అని ఎన్నికల సభలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి సీఎం నితీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్‌ ప్రచారం ముగిసే చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. 
 
 ఈ నెల 7న చివరి, మూడో దశ పోలింగ్‌ జరుగనుండగా 10న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే 69 ఏండ్ల నితీశ్‌ కుమార్‌ ఈ ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఐదోసారి ముఖ్యమంత్రి  కావాలన్న ఆయన కల నెరవేరుతుందా లేదా అనేది ఈ నెల 10వ తేదీ తర్వాత తెలుస్తుంది. 
 
అయితే బీహార్‌ సీఎంగా ఆయన పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ నిర్వహించిన సర్వే ప్రకారం జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ను సీఎంగా 31 శాతం మంది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. 27 శాతం ప్రజాదరణతో తేజస్వి యాదవ్‌ తర్వాత స్థానంలో ఉన్నారు.
 
1974-75లో దేశం మొత్తంలో సంచలనం కలిగించిన జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలోని విద్యార్థి, యువజన ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ప్రజా జీవనంలోకి వచ్చిన నితీష్ కుమార్ 1990వ దశకంలో బీహార్ రాజకీయాలపై ఆధిపత్యం వహిస్తూ వస్తున్న మండల్ రాజకీయాలలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా గత రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారు. 
 

మొదట్లో లాలూ అనుచరుడిగా, తర్వగా సమతా పార్టీ అధినేత జార్జ్ ఫెర్నాండేజ్ అనుచరుడిగా రాజకీయాలలో ఎదుగుతూ వస్తున్న ఆయన మొదటగా 2000లో ఎన్డీయే అభ్యర్థిగా బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ఎక్కువ రోజులు అధికారం నిలబెట్టుకోలేక పోయారు. కానీ 2005 నుండి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. 

జూన్ 2013 నుండి జులై 2017 వరకు మినహా ఆయన మొత్తం బిజెపి మద్దతుతోనే బీహార్ రాజకీయాలలో కీలక శక్తిగా కొనసాగుతున్నారు.