
ఇసుక తవ్వకాలలో ప్రభుత్వ సంస్థలకే తొలి ప్రాధాన్యం కపిస్తూ నూతన ఇసుక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై మంత్రివర్గ సంఘం నివేదిక ప్రకారం నూతన విధానం రూపొందించారు. అన్ని రీచ్‌లను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం తెలిపారు.
ఒకవేళ ప్రభుత్వ సంస్థలు ముందుకు రానిపక్షంలో టెండర్లు పిలుస్తామని మంత్రి కె కన్నబాబు మీడియాకు తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ఇసుక బుక్ చేసుకోవచ్చని, వినియోగదారులు సొంత వాహనాల్లో నేరుగా ఇసుక రీచ్ నుంచే ఇసుక తీసుకు వెళ్లవచ్చని తెలిపారు. ఇక ప్రభుత్వ ధరల కంటే ఎక్కువ రేట్లకు ఇసుక అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
ఇసుక ధరలపై ప్రజలు ఎస్‌ఈబీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ‘‘ఎస్‌ఈబీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాం. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఈబీకి అనుసంధానం. ఎస్‌ఈబీ పరిధిలోకి గుట్కా, జూదం, మత్తు పదార్ధాలు తీసుకువస్తాం’’ అని మంత్రి వివరించారు.
కాగా, మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో రూ.5,835 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది. చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి ఆమోదం తెలిపింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేసేందుకు ఆమోదం తెలిపింది. సమగ్ర భూసర్వే కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించిన మంత్రి జనవరి నుంచి జూన్ 2023 నాటికి దశల వారీగా రీసర్వే పూర్తి చేయనున్నట్లు కన్నబాబు తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టుల ఏర్పాటు చేస్తామని, గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిజికల్ బౌండరీలను ఫిక్స్ చేస్తామని.. సర్వే రాళ్లను ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు. వందేళ్ల తర్వాత మళ్లీ భూ సర్వేను చేయబోతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు
ఇక విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై కూడా ఈ సందర్భంగా చర్చించింది.
More Stories
శారదా పీఠం భవనం స్వాధీనంకు టిటిడి నోటీసు
అన్యమత ప్రిన్సిపాల్ పై టిటిడి వేటు!
విశాఖ మేయర్‌పై నెగ్గిన కూటమి అవిశ్వాస తీర్మానం