ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు కమీషన్ సిద్ధం  

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) హైకోర్టుకు నివేదించింది. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. అన్నీ పరిశీలించి,  ఆచరణాత్మకమైన షెడ్యూలును రూపొందిస్తామని తెలిపింది. 

అయితే, గత అనుభవాల దృష్ట్యా, ఈసారి పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సి ఉందని, శాంతిభద్రతలు నెలకొల్పాలని పేర్కొంది. ఇందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల నిర్వహణపై వివరాలు సమర్పించాలని  ఆదేశించడంతో ఆ మేరకు నిమ్మగడ్డ మంగళవారం హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.  

స్థానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 11 పార్టీల ప్రతినిధులు నేరుగా హాజరయ్యారని, మరో రెండు పార్టీలు తమ అభిప్రాయాన్ని పంపాయని తెలిపింది. హింసాత్మక

ఘటనలు చోటు చేసుకున్న చోట ఎన్నికల ప్రక్రియను రద్దుచేయాలని, ఆ ఘటనలపై విచారణ జరపాలని ఆయా పార్టీలన్నీ ముక్తకంఠంతో కోరాయని ఎస్‌ఈసీ తన అఫిడవిట్‌లో తెలిపింది. 

గత మార్చిలో కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం, తదనంతరం తనను ఎస్‌ఈసీగా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, కోర్టుల జోక్యంతో మళ్లీ తను పదవీ బాధ్యతలు స్వీకరించడం, అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తన అఫిడవిట్‌లో వివరించారు. 

‘‘కరోనా ప్రారంభమవుతున్న సమయంలో… పరిస్థితి తీవ్రతను గుర్తించి స్థానిక ఎన్నికలను వాయిదా వేశాం. అయితే, ప్రస్తుతం రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. బిహార్‌లో ఎన్నికలు తొలిదశ విజయవంతం కాగా, తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి” అని గుర్తు చేశారు. 

ప్రజారోగ్య సంరక్షణతో పాటు ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత కూడాతమపై ఉందని స్పష్టంచేశారు.  ప్రజల భద్రత కోసం తగిన చర్యలు చేపడుతూనే దశలవారీగా షెడ్యూల్‌ ప్రకటించాలని కమిషన్‌ భావిస్తోందని పేర్కొన్నారు. అయితే  వాయిదా పడిన ఎన్నికల నిర్వహణ కోసం ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి పూర్తిగా సహకరించాల్సిందేనని ఎస్‌ఈసీ తెలిపింది. 

శాంతిభద్రతలు నెలకొల్పడం, ఓటరుకు భరోసా ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. ‘‘స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలను నిర్వహించేందుకు మొత్తం రాష్ట్ర యంత్రాంగం గట్టిగా పని చేయాలి. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. ఎన్నికల ప్రక్రియను ధ్వంసం చేయడానికి చేసిన తప్పిదాలు, క్రూర చర్యలకు ప్రేక్షకులుగా ఉండలేం’’ అని స్పష్టం చేసింది.