
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దినదిన గండంగా ఉంది. ప్రతి నెలా తొమ్మిది నుంచి పది వేల కోట్ల రూపాయల వరకు లోటు కనిపిస్తుండగా, మొత్తం ఏడు నెలల్లో ఏకంగా 68 వేల కోట్లకు లోటు చేరుకుంది.
ఆర్ధిక సంవత్సరం తొలి నెలల్లో కరోనా కారణంగా సొంత పన్నుల ఆదాయం తీవ్రంగా తగ్గడం, ఖర్చులు తగ్గకపోవడంతో ఖజానా కష్టాల్లో పడింది. అయితే నాలుగు నెలలుగా వరుస ఆన్‌లాక్‌లతో అనేక రంగాలపై సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయ వ్యయాల మధ్య అంతరం మాత్రం తగ్గలేదు.
ఇప్పటివరకు రూ 28,994 కోట్లు మాత్రమే ఆదాయంగా రాగా, ఖర్చు మాత్రం ఏకంగా రూ 96,950 కోట్లకు చేరింది. దీంతో రూ. 67,957 కోట్లు లోటుగా తేలింది. ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్‌లో మాత్రమే రూ. ఏడు వేల కోట్ల మైలు రాయిన దాటిన ఖజానా ఆదాయం అక్టోబర్‌లో మళ్లీ ఆరు వేల కోట్లకన్నా తక్కువకు చేరింది.
మొత్తం మీద ప్రతి నెలా సగటున రూ 4,142 , కోట్లు మాత్రమే వచ్చింది. ఇక ప్రతి నెలా సగటున రూ 13,850 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది, దీనిపై తాజాగా ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఒక సమీక్షా సమావేశంలో అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అనవసర వ్యయాన్ని తగ్గించుకోకపోతే సమస్యలు పెరుగుతాయని కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం చేస్తున్న మొత్తం వ్యయం సంక్షేమ పథకాలకే సంబంధించినదే కావడంతో దానిని కుదించుకోవడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి, ఆర్ధికమంత్రి కూడా అధికారులకు తేల్చిచెప్పడం తెలుస్తున్నది.
More Stories
శారదా పీఠం భవనం స్వాధీనంకు టిటిడి నోటీసు
అన్యమత ప్రిన్సిపాల్ పై టిటిడి వేటు!
విశాఖ మేయర్పై నెగ్గిన కూటమి అవిశ్వాస తీర్మానం