బాంగ్లాదేశ్ లో హిందూవుల ఇండ్లపై ఇస్లామిస్ట్స్ దాడి  

ఇస్లాం మతం గురించి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌పై కామెంట్‌ చేసినందుకు బంగ్లాదేశ్‌లోని కుమిల్లాలో హిందువుల ఇండ్లపై స్థానిక రాడికల్‌ ఇస్లాంవాదులు దాడికి దిగి ధ్వంసం చేశారు. అనంతరం అగ్నికి ఆహుతిచేశారు. దాదాపు ఐదు గంటలపాటు విధ్వంసం కొనసాగినప్పటికీ అక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. 

ఫేస్‌బుక్‌లో మహమ్మద్ ప్రవక్తపై వచ్చిన కార్టూన్లను సమర్థిస్తూ ఫ్రాన్స్‌కు మద్దతుగా ఒక వ్యక్తి కామెంట్ చేశారన్న ఆగ్రహంతో కొమిల్లాలో అనేక మంతి హిందువుల గృహాలను ధ్వంసం చేసి కాల్చివేశారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం కొమిల్లాకు చెందిన మురద్‌నగర్ ఉపజిల్ల పరిధిలోని కోర్బన్‌పూర్ గ్రామంలో జరిగినట్లు ఢాకా ట్రిబ్యూన్ పత్రిక తెలిపింది.

స్థానిక యూనియన్ పరిషత్ చైర్మన్ బంకుమార్ శివ్ కార్యాలయానికి, శంకర్ దేబ్నాథ్ ఇంటికి ఆందోళనాకారులు నిప్పంటించారు. విధ్వంసం కేసుకు సంబంధించి పుర్బో ధౌర్‌లోని కిండర్ గార్డెన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బాంగ్రా బజార్ పోలీస్ స్టేషన్‌ అధికారి కమ్రుజ్జామన్ తాలూక్డర్ తెలిపారు.

కుమిల్లా డిప్యూటీ కమిషనర్, ఎండి అబుల్ ఫజల్ మీర్, పోలీసు సూపరింటెండెంట్ సయ్యద్ నూరుల్ ఇస్లాం ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకుని శాంతిభద్రతలను కాపాడే చర్యలు తీసుకున్నారు. కుమిల్లాలో ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉన్నదని పోలీసులు తెలిపారు. 

అరెస్టయిన వారి గృహాలతో పాటు స్థానికులు ఇండ్లను ధ్వంసం చేసి దహనం చేశారని కుమిల్లా డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆందోళనాకారులను గుర్తించడానికి వీడియో ఫుటేజీలను చూస్తున్నట్లు చెప్పారు. పరిస్థితిని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నంలో కుర్బన్పూర్, అండికోట్ గ్రామాలలో నాలుగు ప్లాటూన్ల పోలీసులను మోహరించారు.