దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ఉండాలి

 ‘తక్కువ ప్రభుత్వం, ఎక్కువ పాలన’ మంత్రాన్ని పాటిస్తూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ  ప్రొబేషనరీ సివిల్ సర్వీస్ అధికారులకు పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని కేవడియా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎఎస్ ప్రొబేషనరీలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. 

దేశం స్వాతంత్య్రం పొంది 75వ ఏట అడుగుపెట్టబోతున్న కీలక సమయంలో మీరు సర్వీసులో అడుగుపెడుతున్నారని ప్రధాని వారితో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం కేవలం విధానాలతో నడవదు. ఎవరికోసమైతే పాలసీలు ఉన్నాయో ఆ ప్రజలను కూడా దానిలో భాగస్వాములను చేయాలి. ప్రజలు కేవలం ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను అందుకునే వారు మాత్రమే కాదు.వారే అసలైన చోదకశక్తి’ అని స్పష్టం చేశారు. 

అందువల్ల మనం ప్రభుత్వంనుంచి పరిపాలన దిశగా ముందుకు సాగాలని చెప్పారు. `మీకు రెండు మార్గాలు ఎదురవుతావు. మొదటిది సౌకర్యం, పేరు ప్రఖ్యాతులయితే రెండవది పోరాటం, కష్టాలు, సమస్యలు. అయితే మీరు సులువైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడే నిజమైన కష్టాలను ఎదుర్కొంటారని నేను నా అనుభవంతో చెబుతున్నా’ అని ప్రధాని హితవు చెప్పారు. 

సివిల్ సర్వెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశప్రయోజనాలతో కూడుకున్నదై ఉండాలి. అలాగే దేశ ఐకతను, సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేయడానికి, దేశ రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేదిగా ఉండాలి అని కూడా ప్రధాని ఉద్బోధించారు.