ఇద్దరు యువరాజులను ఇంటిబాట పట్టిస్తారు 

 బీహార్ లో అధికారంకోసం ఆరాటపడుతున్న ఇద్దరు యువరాజులు ప్రజలు ఇంటిదారి పట్టిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. బీహార్ లోని చాప్రా, సమస్తిపూర్ లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపేవరిదో మొదటి విడత పోలింగ్ తోనే తేలిపోయిందని చెప్పారు. 
 
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ‌రాహుల్‌ గాంధీ, ఆర్‌జేడీ కీల‌క‌ నాయ‌కుడు తేజస్వి యాదవ్‌ల పేర్ల‌ను ప్ర‌స్తావించ‌కుండానే వారిని ఇద్ద‌రు యువ‌రాజులు కూటమిగా ప్ర‌ధాని అభివర్ణించారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇద్దరు యువరాజులపై (రాహుల్‌గాంధీ, అఖిలేశ్ యాద‌వ్‌) బీజేపీ విజ‌యం సాధించింద‌ని ప్రధాని గుర్తు చేశారు.
 
 ఇప్పుడు కూడా బీహార్లో సైతం ఇద్ద‌రు యువ‌రాజులు (రాహుల్‌గాంధీ, తేజ‌స్వియాద‌వ్‌) చేతులు క‌లిపి సింహాస‌నంపై కన్నేశార‌ని ప్ర‌ధాని ధ్వజమెత్తారు. నాలుగేండ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఇద్దరు యువరాజులను (రాహుల్‌, అఖిలేష్‌) అక్క‌డి ప్ర‌జ‌లు ఇంటికి పంపిన‌ట్లే, ఇప్పుడు ఇక్కడ బీహార్ ప్ర‌జ‌లు కూడా ఇద్ద‌రు యువ‌రాజుల‌ను ఇంటిబాట ప‌ట్టిస్తార‌ని ప్ర‌ధాని మోదీ జోష్యం చెప్పారు. 
 
యూపీలో ఇద్ద‌రు యువ‌రాజుల‌కు ప‌ట్టిన గ‌తే, ఇప్పుడు బీహార్ ఇద్ద‌రు యువ‌రాజుల‌కు ప‌డుతుంద‌ని స్పష్టం చేశారు. నితిశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
 
‘తొలి దశ పోలింగ్‌ అనంతరం వచ్చిన ట్రెండ్స్‌‌తో ఎన్డీఏ మళ్లీ అధికారం‌‌లోకి వస్తుందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్డీఏను ఇష్టపడటం కొందరికి నచ్చడం లేదు. వాళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్‌లో ఎన్డీఏ గెలుస్తుందన్న సమాచారంతో కొందరు నేతలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అందుకే వారు నన్ను తిడుతున్నారు. వాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. బిహారీలపై మీ కోపాన్ని ప్రదర్శించొద్దు’ అంటూ ప్రధాని హితవు చెప్పారు.
బీహార్‌లో డబుల్‌ ఇంజన్ (జేడీయూ, బీజేపీ)‌ ప్రభుత్వముంద‌న్న‌ తేజస్వి వ్యాఖ్యలకు కూడా ప్ర‌ధాని కౌంట‌ర్ ఇచ్చారు. త‌మ డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం త‌మ‌తో పోటీప‌డుతున్న ఇద్ద‌రు యువ‌రాజుల‌ను బోల్తా కొట్టించ‌డం ఖాయ‌మ‌ని  భరోసా వ్యక్తం చేశారు.
 
పుల్వామా ఉగ్రదాడి అంశంలో విపక్షాలపై ప్రధాని మరోసారి విమర్శలు గుప్పిస్తూ దాడిని తామే చేశామని అంగీకరిస్తూ పాకిస్థాన్ ప్రకటన దేశంలో బీహార్ అమరసైనికుల త్యాగాలు లెక్కచేయని వారి ముసుగులను తొలగించిందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలకోసం ప్రయత్నించే ఇలాంటి వారితో ఓటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మోదీ సూచించారు.