టర్కీ, గ్రీస్‌లలో పెను భూకంపం

ట‌ర్కీ, గ్రీస్‌ను భారీ భూకంపం కుదిపేసింది. ట‌ర్కీలో భూకంపం వ‌ల్ల మ‌రణించిన‌వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. నిన్న 14 మంది చ‌నిపోగా, ఇప్పుడు ఆ సంఖ్య 22కు చేరింది. ‌భూకంపం కార‌ణంగా 700 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్‌ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని  అధికారులు గుర్తించారు.  
ఎజియన్ సముద్రంలో సంభవించిన ఈ భూకంపంతో అనంతర సునామీ ఏర్పడింది. పశ్చిమ టర్కీ ప్రాంతం అంతా ఈ పెనుభూకంప తీవ్రతకు గురయిందని, తీర ప్రాంత పట్టణాలు బాగా దెబ్బతిన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఎజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతున భూ ప్రకంపన చోటుచేసుకుందని టర్కీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు.

గ్రీస్ దీవి సొమోస్ ఉత్తర ప్రాంతం కూడా ఈ ప్రకంపనల ధాటికి తల్లడిల్లింది. టర్కీకి చెందిన ఇజ్మీర్ నగరంలో ప్రజలు హాహాకారాల నడుమ ఇళ్లలో నుంచి వీధులలోకి వచ్చారు. ఇజ్మీర్‌లో 20 బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలినట్లు నగర మేయర్ వార్తాసంస్థలకు తెలిపారు. బోర్నోవస్, బయార్లిలోని నివాసాలకు కూడా ముప్పు ఏర్పడింది.

అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం సమోస్‌లోని గ్రీకు పట్టణం కార్లోవాసికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్ర‌త 7.0గా న‌మోద‌య్యింది. సామోస్ దీవులకు ఈశాన్యంలో 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయింది. ఇజ్మిర్ నగరం త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తున్నట్లు టర్కీ అధ్యక్షులు రెసెప్ ఎర్గోగాన్ ట్వీటు వెలువరించారు.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోనూ ప్రకంపనల ప్రభావం పడింది. టర్కీ తీర ప్రాంతం నుంచి గ్రీస్ ఐలాండ్ సామోస్ వరకూ ఈ పెను భూకంపం తలెత్తింది. ఈ ప్రాంతంలో అనంతర ప్రకంపనలు తలెత్తుతుండటంతో దెబ్బతిన్న భవనాలు కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది.

 ఈ ఏడాది జనవరిలో ఇలాజిగ్‌ ప్రావిన్సు‌లో సంభవించిన భూకంపంలో 30 మందికిపైగా మృతి చెందారు. 1600 మందికి పైగా గాయపడ్డారు. 1999లో ఇస్తాంబుల్‌ సమీపంలోని ఇజ్మిట్‌ నగరంలో వచ్చిన భూకంపంలో సుమారు 17 వేలమంది కన్నుమూశారు.