ముంగెర్‌ కాల్పులపై ఆత్మరక్షణలో బీహార్ పోలీసులు 

దుర్గామాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఈనెల 26న బీహార్ లోని ముంగెర్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన చుట్టూ రాజకీయం ముసురుకుంటున్న నేపథ్యంలో బీహార్ పోలీసులు ఆత్మరక్షణాలు పదిన్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయమై కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ (సీఐఎస్ఎఫ్) ఎన్నికల కమీషన్ కు సమర్పించిన నివేదికలో  పోలీసులే ముందుగా కాల్పులు జరిపినట్లు స్పష్టమైనది. 

ఈ నివేదికను ఎన్నికల కమిషన్‌కు సీఐఎస్ఎఫ్ సమర్పించినట్టు ఐఏఎన్‌ఎస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది. నివేదక ప్రతిలోని సమాచారం ప్రకారం, నిమిజ్జనం ఊరేగింపు వేగాన్ని నెమ్మదింపచేయడంతో పోలీసులకు, భక్తులకు మధ్య వాగ్యుద్ధం మొదలైంది. ఆ క్రమంలో కొందరు స్థానికులు పోలీసు పార్టీపై రాళ్లు రువ్వారు. ఇందుకు ప్రతిగా స్థానిక పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. 

దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు మరింత ఉధృతంగా రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సీఐఎస్ఎఫ్‌కు చెందిన ఎం.గంగయ్య అనే వ్యక్తి ఇన్సాస్ రైఫిల్ నుంచి గాలిలోకి 13 రౌండ్లు కాల్పులు జరిపినట్టు నివేదిక తెలిపింది.

మరోవంక, సోమవారం రాత్రి ఘటనలో పోలీసులే కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, సంఘ వ్యతిరేక శక్తులే ఈ కాల్పులు జరిపారని, పోలీసులు కాదని బీహార్ పోలీసులు కొట్టిపారేశారు.

సంప్రదాయం ప్రకారం విజయదశమి తర్వాత మూడు రోజులకే దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. అయితే బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ కారణంగా మరుసటి రోజే నిమజ్జనంకు స్థానికులు అంగీకరించారు. సాయంత్రం 5 గంటలకే నిమజ్జనం పూర్తి కావాలని పోలీసులు పట్టుబడుతుండగా, రాత్రి 11 గంటల తర్వాత నిమ్మజనం పూర్తి కాబోతున్న తరుణంలో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు.

దేవత విగ్రహాలను తమ భుజాలపై తీసుకు వెడుతున్న నలుగురిని తీవ్రంగా కొట్టడంతో స్థానికులు ఆగ్రవేశాలకు గురయ్యిన్నట్లు చెబుతున్నారు. పోలీసులు ముందుగా కాల్పులు జరిపి, తర్వాత టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు రాళ్ళ రావడంతో కాల్పులు జరపవలసి వచ్చినదని పోలీసులు  చెబుతుండగా,పోలీసులే రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, తమ బలగాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, దహనకాండకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని డీఐజీ మను మహరాజ్ మీడియాకు తెలిపారు. అక్టోబర్ 26న జరిగిన ఘటనలో వ్యక్తి మృతికి కారణంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మరోవైపు, పూరబ్ సరాయ్ పోలీస్ స్టేషన్ నుంచి 100 రౌండ్ల బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లు మాయమైనట్టు ముంగెర్ పోలీసులు శుక్రవారం తెలిపారు. పోలీసు చర్యపై అసంతృప్తితో ఉన్న ఆందోళనకారులు పూరబ్ సరాయ్ పోలీస్ స్టేషన్‌ను గురువారం ధ్వంసం చేశారు.