ఉత్తరాఖండ్‌ సీఎంకు సుప్రీం కోర్ట్ లో ఊరట    

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌పై హైకోర్టు  ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జార్ఖండ్ గౌ సేవా ఆయోగ్‌కు అధిపతిగా ఒక వ్యక్తిని నియమించడానికి 2016 లో ముఖ్యమంత్రి బంధువులు బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు బదిలీ అయిందని ఇద్దరు జర్నలిస్టులు సీబీఐ దర్యాప్తు కోసం నైనిటాల్ హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎంపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను దర్యాప్తు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. మరుసటిరోజే రావత్‌ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. సుప్రీంకోర్టు గురువారం ఉత్తరాఖండ్ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. 

అంతకు ముందు, పెద్దనోట్ల రద్దు తర్వాత ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ కుటుంబ సభ్యుల ఖాతాలో జార్ఖండ్‌ వాసి ఒకరు భారీగా నగదు జమ చేశారని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన జర్నలిస్టుపై రాష్ట్ర ప్రభుత్వం నమోదుచేసిన కేసును రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.

సీబీఐతోపాటు ఆరోపణలు చేసిన ఇద్దరు జర్నలిస్టులకు నాలుగు వారాల్లో స్పందించాలని సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే ముందు హైకోర్టు తన మాట వినలేదని సుప్రీంకోర్టుకు రావత్‌ విన్నవించారు.

సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ వ్యవహారంపై విపక్ష కాంగ్రెస్‌ మండిపడింది. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయగా, సీఎంపై అవినీతి ఆరోపణలు రుజువు కాలేదని అధికార బీజేపీ సమర్థించుకున్నది.