బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి తప్పిన పెను ప్రమాదం

బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ గురువారం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మార్గమధ్యంలోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు కోల్పోవడంతో తీవ్ర కలకలం రేగింది. 

అయితే దాదాపు 40 నిమిషాల తర్వాత మళ్లీ పైలట్ సదరు హెలికాప్టర్‌ను పాట్నా విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో  అంతా ఊపిరిపీల్చుకున్నారు. తివారీ, ఆయన బృందం గురువారం ఉదయం బెట్టియాలో  జరిగే ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లగా… సాంకేతిక సమస్యల కారణంగా హెలికాప్టర్ 40 నిమిషాల పాటు ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది.

 ‘‘పాట్నా ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ ఉదయం 10.10కి బయల్దేరింది. అయితే కొద్దిసేపటికే అది ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. దారి తెలియక  పైలట్ ఇబ్బంది పడడంతో మేమంతా తీవ్ర ఆందోళనకు గురయ్యాం. హెలికాప్టర్‌కు, ఏటీసీకి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి…’’ అని తివారీతో పాటు వెళ్లిన నీల్ బక్షిపేర్కొన్నారు. 

తాము ఎక్కడ ఉన్నామో తెలియక పోవడంతో దాదాపు 40 నిమిషాల పాటు తాము తీవ్ర భయాందోళనలో గడిపామని ఆయన తెలిపారు. మాన్యువల్ బుక్ సాయంతో పైలట్ పాట్నా ఎయిర్‌పోర్టుకు తిరిగివచ్చినట్టు బక్షి పేర్కొన్నారు. 

‘‘ఏటీసీతో మాట్లాడేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో.. ఏటీసీకి సంకేతాలు పంపేందుకు పైలట్ ఎమర్జెన్సీ లైట్లు ఆన్ చేశాడు. ఏటీసీ నుంచి అనుమతి వచ్చే వరకు హెలికాప్టర్ గాల్లోనే పాట్నా చుట్టూ పలుమార్లు చక్కర్లు కొట్టంది..’’ అని ఆయన చెప్పారు. 

కాగా, మూడేళ్ళ క్రితం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంలో కూడా మనోజ్ తివారి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఇటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నది. 

ఎమర్జెన్సీ ల్యాండ్ సందర్భంగా హెలికాప్టర్ దిగే వరకు విమానాశ్రయంలో మిగతా రాకపోకలన్నీ నిలిపివేశారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా అధికారులు మిగతా అత్యవసర సేవలైన ఫైర్ ఇంజిన్, వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.

ఈ ఘటన వల్ల కేంద్రమంత్రి నిత్యానందరాయ్ వంటి మరికొందరు బీజేపీ నేతల హెలికాప్టర్ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కాగా బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లలో సమస్యలు తలెత్తడం ఇది రెండోసారి.

గత వారంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, బీహార్ మంత్రి మంగళ్ పాండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రెక్కలు ఓ వైరును, కాంక్రీట్ గోడను తాకాయి.