పాక్ నేత మాటలు రాహుల్ కళ్ళు తెరిపిస్తాయా?

భారత ఆర్మీ, ప్రభుత్వం, ప్రజలపట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హితవు పలికారు. రాహుల్ ఎంతగానో విశ్వసించే దేశమైన పాకిస్థాన్‌కు చెందిన నేత మాటలైనా ఆయన కళ్లు తెరిపిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా భారత ఆర్మీని తక్కువ చేసి మాట్లాడేరాజకీయాలకు స్వస్తి చెప్పాలని కోరారు. 

కాగా పాక్ ప్రతిపక్ష నేత అయాజ్ సాదిఖ్ బుధవారం అక్కడి జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ అభినందన్ వర్ధమాన్ విడుదల సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా వణికి పోయారని పేర్కొనడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను నడ్డా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

‘మన దేశ ఆర్మీని తక్కువ చేసి చూపించడమే లక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తెరతీసింది. సాయుధ దళాలను, వారి ధైర్యసాహసాలను విమర్శించే విధంగా మాట్లాడింది. అంతేకాదు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌లో ల్యాండ్ కాలేవంటే ప్రచారం చేసింది’ అంటూ నడ్డా పేర్కొన్నారు.

ఇలాంటి ప్రచారాలను భారత ప్రజలు తిప్పికొట్టారని, ఓటమి రూపంలో వారికి శిక్ష విధించారని నడ్డా ఎద్దేవా చేశారు. భారతీయులను, భారత ఆర్మీని, ప్రభుత్వాన్ని నమ్మని కాంగ్రెస్ పార్టీ వారికి ఎంతో విశ్వాసపాత్రమైన పాక్ వల్లనైనా కళ్లు తెరుస్తుదేమో. ఇప్పటికైనా రాహుల్‌జీ కాస్త కళ్లు తెరవండి అంటూ చురకలు అంటించారు.