రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ వెనుకడుగు!

తన రాజకీయ ప్రవేశంపై ఎప్పటికప్పుడు గడువు పొడిగిస్తూ వస్తున్న  తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది మొదట్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో తన అనారోగ్య కారణాలతో రాజకీయ ప్రవేశం చేయడం సాధ్యపడక పోవచ్చని సంకేతం ఇచ్చారు. 

2016లో తనకు కిడ్నీ మార్పిడి జరగడంతోపాటు కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో రాజకీయ ప్రవేశంపై వైద్యులు తనను వారిస్తున్నారని ఆయన ప్రకటించారు. అయితే, తన అభిమాన సంఘం కార్యవర్గ సభ్యులను సంప్రదించిన తర్వాత తాను రాజకీయాల్లోకి ప్రవేశించేది లేనిది తగిన సమయంలో ప్రకటిస్తానంటూ రజనీకాంత్ ట్వీట్ చేశారు.

తన ఆరోగ్య పరిస్థితిని బట్టి తాను రాజకీయాల్లోకి ప్రవేశించడంపై తన నిర్ణయాన్ని పున:పరిశీలిస్తానని తాను ఒక ప్రకటన చేసినట్లు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఆ ప్రకటన తాను చేయలేదని, అయితే తన ఆరోగ్య పరిస్థితి, తనకు డాక్టర్లు ఇచ్చిన సూచనలు మాత్రం పూర్తి వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. 

రజనీ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ప్రకటనలో తనకు 2016లో జరిగిన కిడ్నీ మార్పిడి గురించి, తనను రాజకీయాల్లోకి ప్రవేశించవద్దని డాక్టర్లు చేసిన సూచనను ప్రస్తావించారు.

అలాగే ప్రస్తుతం కరోనా వైరల్ ప్రబలుతున్న దృష్టా ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లడం మంచిదికాదంటూ కూడా డాక్టర్లు ఆయనకు సూచించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న రజనీకి 2011లో సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స జరిగిందని, 2016 మేలో ఆయనకు అమెరికాలోని ఒక ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.