జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
వైకే పోరా గ్రామంలో బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీనియర్ పోలీసు అధికారులు టెర్రర్ క్రైమ్ స్పాట్‌కు చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.
మృతులను వైకె పోరా నివాసి బీజేపీ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ యాటూ కుమారుడు ఫిదా హుస్సేన్ యాటూ, సోఫర్ దేవ్‌సర్ నివాసి అబ్దుల్ రషీద్ బీగ్ కుమారుడు ఉమర్ రషీద్ బీగ్, వైకె పోరా నివాసి మొహద్ రంజాన్ కుమారుడు ఉమర్ రంజాన్ హజామ్‌గా పోలీసులు గుర్తించారు.
జూన్ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 8 మంది బీజేపీ కార్యకర్తలు బలయ్యారు. తాజా ఘటనపై కుల్గాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తల హత్య నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు ఉగ్రవాదుల తీరుపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కుల్గాం జిల్లాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తల కాల్చివేతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో బీజేపీ ఎదుగుదలకు ఎంతోగానే శ్రమిస్తున్న యువ కార్యకర్తలను దారుణంగా హతమార్చడాన్ని ఖండించారు. బాధితులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’