ఎంసెట్ కౌన్సెలింగ్ ఆపాలని హైకోర్టు ఆదేశం

గురువారం నుంచి జరగాల్సిన ఎంసెట్‌ రెండో దశ ‌ కౌన్సెలింగ్‌ను ఆపేయాలని జేఎన్‌టీయూను హైకోర్టు ఆదేశించింది. కరోనా మహమ్మారి వల్ల ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫీజు చెల్లించి పరీక్షలు ‌ రాయలేకపోయిన, పరీక్షలు రాసి ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు పెట్టలేదు. ఇలాంటి విద్యార్థులను 35 శాతం మార్కులు వచ్చినట్లుగా పరిగణించి పాసైట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

దీంతో, ఎంసెట్‌ షరతులకు అనుగుణంగా తమకు 45 శాతం మార్కులు రాలేదని, కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం లేకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందని దిగ్గిళ్ల సాకేత్‌ చైతన్య ఇతర విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ పి.నవీన్‌రావు ఈ పిల్​ను విచారించారు.

పిటిషనర్ల తరహా 35 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులను ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని ప్రభుత్వ హామీ మేరకు వారందరినీ రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని, ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసే వరకూ రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని ఎంసెట్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న జేఎన్‌టీయూను హైకోర్టు ఆదేశించింది.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలంటే 40/45 శాతం చొప్పున మార్కులు విధిగా వచ్చి ఉండాలనే నిబంధనను సవరించి 35 శాతం వచ్చిన విద్యార్థులను కూడా అనుమతిస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ఇచ్చిన హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసింది. ఎంసెట్‌ నిబంధనలు సడలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు రెండు రోజుల్లో జీవో జారీ ఇస్తుందని ఏజీ తెలిపారు.