రైతుల మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లులో లేనే లేదని బీజేపీ ఎంపీ డి అర్వింద్ స్పష్టం చేశారు. మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడుతున్నారని సీఎం కేసీఆర్, హరీష్ రావ్‌లు తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నరని ఆయన ధ్వజమెత్తారు.
దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి ఆయన తోగుట మండలంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ‘మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టే ఆలోచనే లేదు. బిల్లు అలా లేదని ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు నేను సిద్దం. నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేస్తావా హరీష్ రావు?’ అంటూ సవాల్ చేశారు.
మంత్రి హరీష్ రావ్ సీఎం కేసీఆర్‌కు గుమాస్తా అని పేర్కొంటూ హరీష్ రావ్‌ది చిల్లరబతుకు, చిల్లర పైసల కోసం తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని అరవింద్ ధ్వజమెత్తారు. మక్కల కొనుగోలు కేంద్రాలను ముందే ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు.
రైతులు మక్కలు సగం ధరకు అమ్మకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలపై అడ్డగోలుగా కామెంట్స్ చేస్తే జరాసంధుడిని చీరినట్టు చీరుతా అని అరవింద్ హెచ్చరించారు.
నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ బిడ్డ కవితను బీజేపీ ఓడించింది కదా.. మరి దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించలేమా అని బీజేపీ అభ్యర్థి ఘునందన్ రావు ప్రశ్నించారు. ఏటి గడ్డ కిస్టాపూర్ ను కేసీఆర్ ప్రభుత్వం మల్లన్న సాగర్ లో ముంచుతోందని ఆరోపించారు.
పోలీసుల తో మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల ప్రజలను ఏడిపించారు.. మనం ఏడ్చుకుంటూ ఏమి చేయలేకపోయినా పైన ఉన్న మల్లన్న దేవుడు చూసిండు.. కాబట్టే దుబ్బాక ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల్లో రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి హరీష్ రావు కు అహంకారం ఎక్కువైందని చెబుతూ ఆయన అహంకారం తగ్గాలంటే ఓటు బిజెపి కి వేయాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు
More Stories
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
ప్రజాపాలన దినోత్సవం కాదు… ప్రజావంచన దినోత్సవం
ట్యాంక్‌బండ్ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి