రైతులకు సంకెళ్లు: ఆరుగురు  హెడ్‌ కానిస్టేబుళ్లు సస్పెండ్‌  

రాజధాని రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలో గుంటూరు రూరల్‌ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు ఆరుగురిని సస్పెండ్‌ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్‌ఎ్‌సఐ, ఆర్‌ఐలకు చార్జిమెమోలు ఇచ్చారు. ఈ వ్యహారంపై ఏఆర్‌ అదనపు ఎస్పీ స్థాయి అధికారి విచారణకు ఆదేశించినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. 

నరసరావుపేట సబ్‌జైలు నుంచి 43 మంది రిమాండ్‌ ఖైదీలను మంగళవారంనాడు గుంటూరు జిల్లా జైలుకు తరలించిన విషయం విధితమే. వారికి గుంటూరు రూరల్‌ ఏఆర్‌ పోలీసులను ఎస్కార్ట్‌గా నియమించారు. రిమాండ్‌ ఖైదీలను సంకెళ్లు వేసి తరలించే క్రమంలో అందులో ఉన్న ఏడుగురు రాజధాని రైతులకు కూడా సంకెళ్లు వేశారు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది.

ఈ ఘటనపై ఎస్పీ విశాల్‌గున్నీ స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏఆర్‌ అదనపు ఎస్పీ, డీఎస్పీలను ఆదేశించినట్టు చెప్పారు.

అన్నం పెట్టే రైతుల చేతులకు సంకెళ్లు వేయటం ఏమిటంటూ అమరావతి రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తోన్న ఆందోళనలు గురువారంకు 317వ రోజుకు చేరాయి. 

కృష్ణాయపాలెం రైతులకు సంకెళ్లు వేయడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటపాలెంలో మహిళలు కళ్లకు గంతలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతవరంలో రైతులు, మహిళలు చేతులు కట్టుకుని నిరసన తెలిపారు.