ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)లో ఎదురుదెబ్బ తగిలింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీమ్ లను ఆపాల్సిందేనని ఎన్‌జీటీ చెన్నై బెంచ్ స్పష్టం చేసింది.
నారాయణపేట జిల్లా బాపన్‌పల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జీటీ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ కె. రామకృష్ణన్, టెక్నికల్ మెంబర్ సైబల్ దాస్ గుప్తాలతో కూడిన ధర్మాసనం 134 పేజీల తీర్పును వెలువరించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారని, వాటిని ఆపాలని ఇదివరకే కేంద్ర జలశక్తి శాఖ ఏపీని ఆదేశించిందని ఎన్‌జీటీ గుర్తు చేసింది.
ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కూడా తప్పనిసరి అని తేల్చిచెప్పింది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినట్టుగా కొత్త ప్రాజెక్టుల డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)లు కేఆర్‌ఎంబీకి సమర్పించి బోర్డుతో పాటు సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్ తీసుకోవాలని ఆదేశించింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రాజెక్టుకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
తాము చేపడుతున్నది కొత్త ప్రాజెక్టు కాదన్న ఏపీ వాదనను గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. ఇది తాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, సాగునీటిని తరలించడానికి చేపట్టిందని తేల్చిచెప్పింది. సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్‌కు ముందస్తు పర్యావరణ అనుమతులు అక్కర్లేదన్న నిపుణుల కమిటీ నివేదికతోనూ ఎన్‌జీటీ విభేదించింది.
ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నం విషయంలో ఒకలా, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ విషయంలో మరోలా నిపుణుల కమిటీ రిపోర్ట్ చేసిందని గుర్తు చేసింది. ఏపీ చేపట్టిన ప్రాజెక్టుల్లో పంపుహౌస్‌తో పాటు కొత్త నిర్మాణాలు ఉన్నాయని, కాలువలను పెద్ద ఎత్తున విస్తరిస్తున్నారని, దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందని ఎన్‌జీటీ అభిప్రాయపడింది. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాలన్న కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను పాటించాలని హితవు చెప్పింది.
More Stories
విశాఖ ఉక్కు కాపాడుకుందాం
22న కృష్ణాతీరంలో 5వేల డ్రోన్ల ప్రదర్శన
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు