బిఎస్‌పి రాజ్యసభ అభ్యర్థికి ఐదుగురు ఎమ్మెల్యేల షాక్ 

ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో బీఎస్‌పీ అధికార అభ్యర్థి అయిన రామ్జీ గౌతమ్‌కు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చే నెలలో 10 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగనుండగా బిజెపికి చెందిన 8 మంది అభ్యర్థులతోసహా 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ బిఎస్‌పి తరఫున ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త, బీహార్ ఇన్‌చార్జ్ రాంజీ గౌతమ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. 
 
ఆయనను ప్రతిపాదించిన 10 మంది బిఎస్‌పి ఎమ్మెల్యేలలో ఐదుగురు బుధవారం యుటర్న్ తీసుకున్నారు. తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఐదుగురు బిఎస్‌పి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సచివాలయానికి ఫిర్యాదు చేశారు.  కొద్దిసేపటికే వారంతా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ను కలుసుకునేందుకు ఆయన పార్టీ కార్యాలయానికి నేరుగా చేరుకున్నారు. 
 
కాగా, 2019లో భాగస్వామ్య పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఇంతటి ఎదురుదెబ్బను బీఎస్‌పీ చవిచూడటం ఇదే మొదటిసారి. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాష్ బజాజ్ నామినేషన్ వేశారు. బీఎస్‌పీకి ఉద్వాసన పలికిన ఐదుగురు ఎమ్మెల్యేలలో అస్లాం చౌదరి, అస్లాం రైని, ముజ్తబ సిద్ధిఖి, హకమ్ లాల్ బింద్, గోవింద్ జాతవ్ ఉన్నారు. 
 
యుపిలో బిజెపికి ఉన్న బలాన్ని బట్టి ఆ పార్టీ తరఫున రాజ్యసభ స్థానాలకు పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులు సునాయాశంగా గెలుపొందుతారు. బిజెపియేతర పార్టీల మద్దతుతో తమ అభ్యర్థి గెలుపొందగలడని బిఎస్‌పి ఆశలు పెట్టుకోగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. యుపి నుంచి ఖాళీ అవుతున్న 10 రాజ్యసభ స్థానాలలో మూడు బిజెపి, నాలుగు సమాజ్‌వాది పార్టీ, రెండు బిఎస్‌పి, ఒకటి కాంగ్రెస్ చెందినవి.