మహాగట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. తేజస్వీని జంగిల్ రాజ్‌కు రాకుమారుడని మోదీ దుయ్యబట్టారు. బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొంటూ తేజస్వీ యాదవ్‌పై పదునైన వ్యాఖ్యలతో దాడి చేశారు.
‘‘తేజస్వీ యాదవ్ బిహార్‌కు కాబోయే యువరాజు కాదు, జంగిల్ రాజ్‌కు రాకుమారుడు. కిడ్నాప్‌ల్లో వారి కుటుంబానికి కాపీరైట్లు ఉన్నాయి. మహాగట్‌బంధన్‌ను గెలిపిస్తే మళ్లీ ఆ జంగిల్ రాజ్ వస్తుంది. బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాకే మార్పు వచ్చింది. నితీష్ ప్రభుత్వం బిహార్‌ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. బిహారీల ఆశలను, ఆశయాలను నెరవేర్చేది ఎన్డీయే మాత్రమే’’ అని మోదీ స్పష్టం చేశారు.
మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. గత ప్రభుత్వాల చూపు ఎప్పుడూ కమిషన్ల మీద మాత్రమే ఉండేదని, ప్రజల అవసరాలపై ఉండేది కాదని విమర్శించారు.
దర్భంగలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొంటూ కొన్ని రోజుల క్రిందటే మహాసేతును ఆవిష్కరించామని గుర్తు చేశారు. దీని ద్వారా రైతులు, వ్యాపారులతో పాటు విద్యార్థుల ప్రయాణాల సమయం తగ్గుతుందని, అంతేకాకుండా ఉపాధి దొరకడానికి కూడా అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఓటు వేసే సందర్భంగా ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆయన బిహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సీతామాత భూమిలో నివసిస్తున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చడమే మా లక్ష్యం.’’ అని మోదీ ప్రకటించారు.
తమ దృష్టి అంతా ‘ఆత్మనిర్భర బిహార్’ వైపే కేంద్రీకృతమైందని, ప్రతిపక్షాల కళ్లు మాత్రం ప్రాజెక్టులకు చెందిన డబ్బులపైనే ఉన్నాయని విమర్శించారు. బిహార్‌ను ఎన్డీయే మాత్రమే కాపాడగలుగుతుందని, అందుకే ప్రజలందరూ ఎన్డీయే కూటమిని ఆదరించాలని పిలుపునిచ్చారు.
బిహార్‌ను ‘జంగల్ రాజ్’ గా మార్చిన వారిని, దోచుకున్న వారికి ఓటు వేయమని నిర్ణయించుకున్నారని మోదీ పేర్కొన్నారు.
బిహార్ అసెంబ్లీకి ఈరోజు తొలి విడత పోలింగ్ మొత్తం 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటల వరకు 44.10 శాతం ఓటింగ్ నమోదైంది. ఒకటి రెండు చెదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు ఈసీ పేర్కొంది.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు