స్థానిక ఎన్నికలకే రాజకీయ పక్షాల మొగ్గు 

ఆంధ్ర ప్రదేశ్ లో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని దాదాపు అన్ని రాజకీయపార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సూచించారు. అయితే కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేటట్లు చూడాలని స్పష్టం చేశారు 

ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీలతో ఎపి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌  వరుస భేటీలు నిర్వహించారు. అన్ని పార్టీలతో ఎస్‌ఈసీ వేర్వేరుగా సమావేశమమయ్యారు. నిమ్మగడ్డతో టిడిపి, బిజెపి, కాంగ్రెస్‌, బిఎస్‌పి, సిపిఎం, సిపిఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. 

సిపిఐ కోరాయి. అధికార పార్టీ వైసిపి, జనసేన మినహా అన్ని పార్టీలు హాజరయ్యాయి. జనసేన ఈమెయిల్‌ ద్వారా తన అభిప్రాయన్ని పంపగా, వైఎస్‌ఆర్‌సిపి పార్టీ ఎస్‌ఇసితో భేటిని బహిష్కరించింది. 

ఏకగ్రీవాలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు నిర్వహించాలని టిడిపి డిమాండ్‌ చేసింది. కానీ వివాదాలకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం తన అభిప్రాయాన్ని తెలిపింది.  

కేంద్ర బృందాలతో ఎన్నికలు నిర్వహించాలని కోరామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు తెలిపారు. నామినేషన్ ఆన్ లైన్‌లో ఫైల్ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదివరలో  ఎన్నికల సందర్భంగా అధికారులపై తీసుకున్న చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిన నిధులను మంజూరు చేయాలని బిజెపి నేత పాకా సత్యనారాయణ కోరారు గతంలో ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్‌ చేసిన వైసిపి.. ఇప్పుడు వద్దు అని చెప్పి రెండు నాలుకుల ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. టిడిపి కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌, ఏకగ్రీవాలను రద్దు చేసి, కొత్తగా నోటిఫికేషన్‌ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

కాగా,   కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కాంగ్రెస్‌ రాష్ట్ర  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలీ స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్‌ ను విడుదల చేసి ఎన్నికలకు వెళ్లాలని కోరారు.  కొత్త జిల్లాలు వస్తే రిజర్వేషన్లు మారతాయని, అందుకే కొత్త జిల్లాల ఏర్పాటు అయ్యాకే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని తాము కోరామని చెప్పారు. 

ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరిగేలా చూడాలని సిపిఎం నేతలు కోరారు. బుధవారం సిపిఎం నేతలు ఈసీ ని కలిశారు. కరోనా, వ్యవసాయం పనులు, విద్య సంవత్సరం, అధిక వర్షాలు వంటి ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల తేదీని నిర్ణయించాలనేది కోరిన్నట్లు సిపిఎం నేత వై వెంకటేశ్వరరావు చెప్పారు. 

 అధికార పార్టీ వారి బలంతో యంత్రాంగం కుమ్మక్కుతో ఏకగ్రీవాలు చేసుకున్నారని, వాటిని రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. అరాచకాలు చేసే చోట్ల దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు