బండి సంజయ్‌ దీక్ష‌ భగ్నం

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్ష‌ను పోలీసులు  గత రాత్రి భగ్నం చేశారు. సిద్ధిపేటలో తన పర్యటనలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ తన కార్యాలయంలోనే నిరాహార దీక్షకు దిగిన సంజయ్‌ ఆరోగ్య స్థితిని డాక్టర్లు పరీక్షించారు. 
 
ప్రైవేటు డాక్టర్ లు వైద్య పరీక్షలు నిర్వహించగా షుగర్ లెవెల్ 70కి పడిపోయాయి. దీంతో సంజయ్‌ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆయన షుగర్‌ లెవెల్స్‌ పడిపోతుండటంతో ప్రభుత్వ వైద్యులు ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. 
 
అనంతరం హుటాహుటిన అంబులెన్స్‌లో నగరంలోని అపోలో రీచ్‌ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. 
 
ఆస్పత్రిలో బండి సంజయ్ దీక్ష విరమించారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి సంజయ్‌ చేత దీక్ష విరమింపజేశారు.
 
మరోవైపు సంజయ్‌పై పోలీసులు భౌతిక దాడి చేయడంపై జాతీయ బీసీ కమిషన్‌ సుమోటోగా కేసు నమోదు చేసింది. సిద్దిపేటలో సోమవారం చోటుచేసుకున్న ఘటనపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించారని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించి అరెస్టు చేశారని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టాయి.
పలు చోట్ల ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేయగా.. కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.