9 గంటల సిబిఐ విచారణలో టీ కూడా తీసుకొని మోదీ 

గుజరాత్ అల్లర్లపై తొమ్మిది గంటల పాటు ఏకధాటిన ప్రశ్నిస్తే, మధ్యలో కనీసం టీ కూడా తీసుకోకుండా, ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలిస్తూ నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ  సహకరించారని సిబిఐ మాజీ డైరెక్టర్,  2002 గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు చేసిన సిట్ మాజీ చీఫ్ఆ ర్‌కే రాఘవన్ వెల్లడించారు. 

ఈ కేసు విచారణలో భాగంగా నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ఏకధాటిగా 9 గంటల పాటు ప్రశ్నించామనీ, కానీ ఆయన ఎక్కడా సహనం కోల్పోలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. దర్యాప్తు అధికారులు దాదాపు 100 ప్రశ్నలు అడిగితే అందులో ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సమాధానం దాటవేయలేదని తెలిపారు. 

విచారణ జరుగుతున్నంత సేపూ మోదీ కనీసం టీ కూడా తీసుకోలేదని తన ఆత్మకథ ‘ఆర్కే రాఘవన్: ఎ రోడ్ వెల్ ట్రావెల్డ్’ పుస్తకావిష్కరణ సందర్భంగా రాఘవన్ తన అనుభవాలను పంచుకున్నారు. గాంధీ నగర్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరగానే మోదీ వెంటనే అందుకు అంగీకరించారనీ, వచ్చేటప్పుడు సొంత వాటర్ బాటిల్‌ వెంట తెచ్చుకున్నారని తెలిపారు. 

అనేక ఏళ్ల పాటు పలు హై ప్రొఫైల్ కేసులను కూడా ఆయన విచారించారు. బోఫోర్స్ కుంభకోణం, 2000 సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు, దాణా కుంభకోణం సహా అనేక కేసుల్లో ఆయన సారథ్యంలోనే విచారణ జరిగింది.

మోదీని ప్రశ్నిస్తున్న సందర్భంగా విచారణలో మోదీ, రాఘవన్ కుమ్మక్కయారంటూ తర్వాత ఎవరైనా ఆరోపణలు చేసేందుకు అవకాశం లేకుండా సిట్ టీమ్ సభ్యుడు అశోక్ మల్హోత్రాను కూడా రంగంలోకి దించారు.

‘‘సిట్ కార్యాలయంలోని నా సొంత చాంబర్‌లో మోదీని తొమ్మిది గంటల పాటు విచారణ జరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు ఏకధాటిగా ప్రశ్నలు వేస్తున్నా మోదీ ఎక్కడా సంయమనం కోల్పోలేదని మల్హోత్రా చెప్పారు. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానాన్ని దాటవేయడం గానీ, స్పందించేందుకు తడువులాడుకోవడం గానీ చేయలేదు” అని వివరించారు.

లంచ్ కోసం బ్రేక్ తీసుకుంటారా అని మల్హోత్రా అడిగినప్పటికీ మోదీ సున్నితంగా తిరస్కరించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలంటూ మోదీని ఒప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని రాఘవన్ పేర్కొన్నారు.

‘‘మోదీ కోసం కాకపోయినా మల్హోత్రా కోసమైనా విశ్రాంతి అవసరమని చెబితే గానీ ఆయన ఒప్పుకోలేదు. మోదీకి ఉన్న ఎనర్జీ లెవెల్ అలాంటిది..’’ అని ఆయన కొనియాడారు. 2012 ఫిబ్రవరిలో గుజరాత్ అల్లర్లపై సిట్ తన దర్యాప్తును ముగించింది. మోదీ, సీనియర్ అధికారులు సహా 63 మందికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చింది.